బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ 500 టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ జోరు కొనసాగుతోంది. సాధారణంగా కొరియా ఓపెన్ గా పిలుచుకునే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో కశ్యప్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్ లో అతడు మలేషియా షట్లర్ పై విజయం సాధించాడు. దీంతో క్వార్టర్స్ కు అర్హత సాధించారు.

కొరియాలోని ఇచియాన్ వేదికన జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత టాప్ షట్లర్లందరూ నిరాశపర్చారు. మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, సైనా నెహ్వాల్ లు తొలి రౌండ్ నుండే వెనుదిరిగారు. అలాంటిది కశ్యప్ మాత్రం ఈ టోర్నీలో సత్తా చాటుతూ క్వార్టర్స్ కు చేరాడు.   

రెండో రౌండ్ లో మలేషియా షట్లర్ లూయీ డారెన్ పై కశ్యప్ 21-17,11-21,21-12  తేడాతో గెలపుపొందాడు. తొలి సెట్ హోరాహోరీగా సాగినా కశ్యప్ దూకుడు ముందు డారెన్ నిలవలేకపోయాడు. సెకండ్ సెట్ లో మాత్రం డారెన్ హవా కొనసాగింది. దీంతో నిర్ణయాత్మక మూడో సెట్ లో చెలరేగిన కశ్యప్ డారెన్ ను చిత్తు చేసి విజయాన్ని కైవసం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య మ్యాచ్ 56 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగింది.   
 
అంతకుముందు జరిగిన తొలిరౌండ్‌ పోరులో కశ్యప్‌ చైనీస్‌ తైపీ షట్లర్  లూ-ఛియా-హంగ్‌ పై గెలుపొందాడు.  21-16,21-16 వరుస సెట్లలో పైచేయి సాధించి  సునాయాసంగా విజయాన్ని అందుకున్నాడు.   

 సంబంధిత వార్తలు

కొరియా ఓపెన్... సింధు, సైనా ఇంటికి... కశ్యప్ ఒక్కడే..