SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
Amit Pasi : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలోనే డెబ్యూట్ మ్యాచ్‌లో బరోడా ఆటగాడు అమిత్ పాసీ 55 బంతుల్లో 114 పరుగులతో అదరగొట్టాడు. 10 ఫోర్లు, 9 సిక్సర్లతో వరల్డ్ రికార్డ్‌ను సమం చేశాడు.

డెబ్యూట్ మ్యాచ్‌లో అమిత్ పాసీ సెంచరీ సంచలనం
హైదరాబాద్ జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో బరోడా వికెట్‌కీపర్ బ్యాటర్ అమిత్ పాసీ అదరగొట్టాడు. సోమవారం తన టీ20 ఆరంగేట్రంలో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. 26 ఏళ్ల ఈ యువ ఆటగాడు కేవలం 55 బంతుల్లో 114 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, తొమ్మిది భారీ సిక్సర్లు ఉన్నాయి. బౌలర్లను ఉతికిపారేసిన పాసీ.. తనదైన షాట్స్ తో ప్రేక్షకులను అలరించాడు.
పాసీ సెంచరీ టీ20 డెబ్యూలో అరుదైన ఘనతగా నిలిచింది. అతను 2019లో నమోదైన ఒక ప్రధాన రికార్డును బ్రేక్ చేస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు.
ప్రపంచ రికార్డ్ సమం చేసిన అరుదైన ఇన్నింగ్స్
అమిత్ పాసీ సెంచరీ కేవలం మ్యాచ్‌కే కాదు, ప్రపంచ క్రికెట్‌లో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. టీ20 డెబ్యూలో పురుషుల క్రికెట్‌లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్‌ను అతను సమం చేశాడు.
ఈ రికార్డ్‌ను 2015 మేలో పాకిస్తాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ నమోదు చేశాడు. ఆయన సియాల్కోట్ స్టాలియన్స్ తరఫున ఫైసలాబాద్‌లో జరిగిన దేశీయ టీ20 మ్యాచ్‌లో 48 బంతుల్లో 114 పరుగులు చేశారు. ఇప్పుడు అమిత్ పాసీ అదే స్కోర్‌తో ఆ రికార్డ్‌ను చేరుకున్నారు.
భారతదేశంలో టీ20 డెబ్యూలో సెంచరీ చేసిన మూడవ బ్యాటర్‌గా పాసీ నిలిచాడు. అతనికి ముందు, పంజాబ్‌కు చెందిన శివమ్ భాంబ్రి (2019), హైదరాబాద్‌కు చెందిన అక్షత్ రెడ్డి (2010) ఈ ఘనత సాధించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూడు సెంచరీలు కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్‌లోనే వచ్చాయి.
భారతీయుల టీ20 డెబ్యూ సెంచరీల జాబితా
- అమిత్ పాసీ 2025, బరోడా vs సర్వీసెస్ 114 రన్స్
- శివమ్ భాంబ్రి 2019, చండీగఢ్ vs హిమాచల్ 106 రన్స్
- అక్షత్ రెడ్డి 2010, హైదరాబాద్ vs ముంబై 105 రన్స్
ఈ జాబితాలో ఇప్పుడు పాసీ అగ్రస్థానంలో ఉండటం అతని అద్భుతమైన ఆట తీరుకు నిదర్శనం.
బరోడాకు విజయం.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా పాసీ
అమిత్ పాసీ విజృంభణతో బరోడా 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ పాసీ తనదైన ఆటతో రన్‌రేట్‌ను పెంచాడు.
అతను 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పుర్తి చేశాడు. అక్కడినుంచి ఇంకా ఆత్మవిశ్వాసంగా బ్యాటింగ్ చేస్తూ 44వ బంతిని సిక్సర్‌గా మలిచి సెంచరీ అందుకున్నాడు. మిగతా 31 బంతుల్లో 64 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లో దూకుడు కొనసాగించాడు.
లక్ష్యం చేధించేందుకు వచ్చిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేసింది. బరోడా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన పాసీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

