ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ 2019 లో భారత సీనియర్ బాక్సర్ అమిత్ పంఘల్ అదరగొట్టాడు. ఈ మెగా టోర్నీలో మొదటి బంగారు పతకాన్ని సాధించి భారత కీర్తి పతాకాన్ని ఆసియా స్థాయిలో రెపరెపలాడించాడు. శుక్రవారం  జరిగిన ఫైనల్లో ప్రత్యర్థిపై మెరుపు పంచులతో విరుచుకుపడ్డ  పంఘల్ పురుషుల విభాగంలో బంగారు పతకాన్ని అందుకున్నాడు. 

థాయ్‌లాండ్ వేదికగా జరుగుతున్న ఈ బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో 23 ఏళ్ల పంఘల్ 52 కిలోల క్యాటగిరీలో పోటీ పడ్డాడు. కొరియాకు చెందిన కిమ్ ఇంక్యూ ను ఫైనల్లో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 

ఈ ఏడాది పంఘల్ కు ఇది రెండో గోల్డ్ మెడల్ కావడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్ లో కూడా పంఘల్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ రెండు అంతర్జాతీయ టోర్నీల్లోనే అతడు 52 కేజీల సీనియర్ పురుషుల విభాగంలో పోటీ పడి ప్రత్యర్థులకు తన పంచ్ దెబ్బలను రుచిచూపించాడు.

ఇక ఇదే పురుషుల విభాగం 75 కేజీల కేటగిరీలో ఆశిష్ కుమార్,  56 కేజీల కేటగిరీలో కవిందర్‌ సింగ్‌ బిష్త్‌, 49 కేజీల కేటగిరీలో దీపక్‌ సింగ్ లు ఫైనల్ కు అర్హత సాధించారు. అలాగే మహిళల విభాగంలో 81 కేజీల కేటగిరీలో పూజా రాణి, 64 కేజీల కేటగిరీలో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ లు ఫైనల్ కు అర్హత సాధించారు. వీరు కూడా ఇవాళే ఫైనల్ పోరులో తలపడనున్నారు. 

సంబంధిత వార్తలు

ఆసియా బాక్సింగ్ చాపింయన్‌షిప్: కాంస్యంతో సరిపెట్టుకున్న తెలంగాణ మహిళా బాక్సర్