దుబాయ్‌: ట్వంటీ20 ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. లీగ్ దశలో పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ లేకపోవడమే అందుకు కారణం. ఇరు దేశాల మధ్య పోటీ అంటే క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు.

ఇరు దేశాల మధ్య ఫలితం కూడా ఎప్పుడూ భారత్ పక్షమే. 2011 వన్డే ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో టీమిండియా గెలిచిన తర్వాత 2012, 2014, 2016 టి20 ప్రపంచకప్‌లతో పాటు 2015 వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా ఇరు జట్లు లీగ్‌ దశలోనే తలపడ్డాయి. 


అత్యంత ఉత్కంఠ రేపిన ఆ నాలుగు మ్యాచుల్లో కూడా విజయం భారత్ నే వరించింది. ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా జూన్‌ 16న ఇరు జట్లు పోటీకి సిద్ధమయ్యాయి. అయితే 2020లో జరిగే టి20 ప్రపంచకప్‌లో దాయాదుల మధ్య లీగ్ దశలో పోటీ లేదు. 

మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రకటించిన షెడ్యూల్‌లో భారత్, పాకిస్తాన్‌ రెండు వేర్వేరు గ్రూప్‌లలో ఉన్నాయి. ప్రస్తుత టి20 ర్యాంకింగ్స్‌లో పాక్‌ తొలి స్థానంలో, భారత్‌ రెండో స్థానంలో ఉండటమే అందుకు కారణం. నాకౌట్‌ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందా, లేదా అనేది లిగ్ దశ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

సంబంధిత వార్త

2020 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల: దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్