ఈ ఏడాది వరల్డ్‌కప్ ఇంకా ప్రారంభంకాకముందే 2020 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపింది. ఈసారి ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.

ఈ ఏడాది వరల్డ్‌కప్ ఇంకా ప్రారంభంకాకముందే 2020 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపింది. ఈసారి ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. ఆసక్తికరంగా మహిళా, పురుషుల టీ20 ప్రపంచకప్‌ ఒకే ఏడాది, ఒకే వేదికపై జరగనుంది.

తొలుత మహిళా టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు మహిళా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 24 నుంచి నవంబర్ 15 వరకు పురుషుల టీ20 వరల్డ్‌కప్ జరగనుంది.

ఈ రెండు టోర్నీలకు మొత్తం 13 వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. రెండు ఈవెంట్‌ల ఫైనల్ మ్యాచ్‌లకు మెల్‌బోర్న్ వేదికకానుండటం విశేషం. మహిళల ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పోటీ పడుతుండగా.. పురుషుల టోర్నీలో 12 జట్లు బరిలో నిలవనున్నాయి.

మహిళల విభాగంలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడుతుండగా.. పురుషుల్లో 2020 అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన పోరాడనుంది. పురుషుల టీ20 టోర్నీకి శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అర్హత సాధించని నేపథ్యంలో ఈ రెండు జట్లు మరో ఆరు జట్లతో క్వాలిఫయిర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడే 8 జట్లలో నాలుగు జట్లు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. పురుషుల విభాగంలో టీమిండియా గ్రూప్-బిలో స్థానం సంపాదించగా, మహిళల విభాగంలో గ్రూప్-ఏలో నిలిచింది. 

టీ20 మహిళా వరల్డ్‌కప్ భారత్ షెడ్యూల్:

ఫిబ్రవరి 21, 2020: ఆస్ట్రేలియాతో సిడ్నీలో

ఫిబ్రవరి 24, 2020: క్వాలిఫయర్ 1తో పెర్త్‌లో

ఫిబ్రవరి 27, 2020: న్యూజిలాండ్‌తో జంక్షన్ ఓవల్‌లో

ఫిబ్రవరి 29, 2020: శ్రీలంకతో జంక్షన్ ఓవల్‌లో


టీ20 పురుషుల ప్రపంచకప్: భారత్ షెడ్యూల్

అక్టోబర్ 24, 2020: దక్షిణాఫ్రికాతో పెర్త్‌లో

అక్టోబర్ 29, 2020: క్వాలిఫయర్ 2తో మెల్‌బోర్న్‌లో

నవంబర్ 1, 2020: ఇంగ్లాండ్‌తో మెల్‌బోర్న్‌లో

నవంబర్ 5, 2020: క్వాలిఫయర్ 1తో అడిలైడ్‌లో

నవంబర్ 8, 2020: ఆఫ్ఘనిస్తాన్‌తో సిడ్నీలో