పది సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదమే..పూరన్ ని క్రికెట్ ప్రపంచానికి దూరం చేశాయా అంటే..అవుననే సమాధానమే వస్తుంది.
అంబులెన్స్ సైరన్, భరించలేని నొప్పి, చావు దగ్గర పడుతున్నట్టు అనిపించింది. ఎవరైనా తనని కారులోంచి బయటకు తీసుకెళ్తే బాగుండు అనుకున్నాడు ఆ యువకుడు. కళ్ళు మూసుకుపోయాయి, శరీరం స్పృహ కోల్పోయింది.
10 సంవత్సరాల క్రితం జనవరి నెలలో ఏం జరిగిందంటే..
2014 అండర్ 19 ప్రపంచ కప్‌లో సంచలనం సృష్టించిన వెస్ట్ ఇండీస్ ఆటగాడు నికోలస్ పూరాన్. ట్రినిడాడ్‌లోని బాల్మెయిన్‌లో ఉన్న ప్రాక్టీస్ సెంటర్ నుండి కోవాలోని తన ఇంటికి కారులో వెళ్తున్నాడు. అంతే క్షణాల్లో జీవితం తలకిందులైంది.వేగంగా వస్తున్న కారు పూరాన్ కారుని ఓవర్‌టేక్ చేయబోయింది. సైడ్ ఇవ్వబోతే పూరాన్ కారు మట్టిదిబ్బను ఢీకొట్టింది. కారుని వెనక్కి తీసుకుంటుండగా మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత అంతా ఒక పీడకలలా అయిపోయింది.
కళ్ళు తెరిచేసరికి చుట్టూ తెలిసిన వాళ్ళు లేరు, తెలిసిన ప్రదేశం కాదు. ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు. కాళ్ళు కదపాలని చూసాడు. కానీ కాళ్ళు ఉన్నట్టుగానే అనిపించలేదు. ఎడమ మోకాలికి పగుళ్లు, కుడి కాలు విరిగిపోయింది. ఇంకా శరీరం అంతా చాలా గాయాలు.
మళ్ళీ క్రికెట్ ఆడగలనా…
ఒకటే ప్రశ్న అడిగాడు డాక్టర్‌ని. మళ్ళీ క్రికెట్ ఆడగలనా అని. డాక్టర్ నోటి వెంట సమాధానం రాలేదు. కానీ డాక్టర్ ముఖంలో కనిపించింది. మళ్ళీ ఇంకో ప్రశ్న. పరిగెత్తగలనా అని. 'బహుశా' అని సమాధానం. నడవగలనా అని అడిగితే 'నడవగలవు' అన్నారు.12 రోజులు నొప్పి మందులతో బతికాడు. కెరీర్ మొదలవుతున్న సమయం, జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం దగ్గరకు వచ్చింది. రెండు సర్జరీలు చేశారు. వీల్‌చైర్‌లో ఇంటికి వెళ్ళాడు. ఆరు నెలలు వీల్‌చైర్, బెడ్ మీదే గడిపాడు.
జీవితంలో నిజాలు ఆ రోజుల్లోనే తెలిసాయని పూరాన్ చెప్పాడు. ఈలోపు వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు ఆర్థిక సహాయం ఆపేసింది. కీరన్ పొలార్డ్ అప్పుడు దేవుడిలా వచ్చాడు. పొలార్డ్ కూడా అప్పుడు గాయాలతో బాధపడుతున్నాడు. ఇద్దరూ కలిసి కోలుకున్నారు. శరీరాన్ని, డాక్టర్ల మాటలను ఓడించాడు పూరాన్.
లారా లాగా ఆఫ్ సైడ్…పొలార్డ్ లాగా బలంగా..
సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కనిపించాడు. నీ ప్రతిభ మీద నమ్మకం ఉంచు, దానికి తగ్గట్టు కష్టపడు అని తనకి తానే చెప్పుకున్నాడు. తన ప్రతిభ మీద నమ్మకంతో కష్టపడ్డాడు. కష్టాలను సిక్సర్లలా దూరంగా కొట్టాడు.పదేళ్లు గడిచాయి. ఈ రోజు నికోలస్ పూరాన్ ఎవరని అడిగితే ఒకటే సమాధానం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్. అద్భుతమైన స్ట్రోక్‌ప్లే, పవర్ హిట్టింగ్. లారా లాగా ఆఫ్ సైడ్‌లో అందంగా ఆడతాడు, పొలార్డ్ లాగా బలంగా కొడతాడు.
టీ20 లీగ్‌లలో పూరాన్ కన్నా విలువైన ఆటగాడు ఉన్నాడా అనేది సందేహమే. వెస్ట్ ఇండీస్ క్రికెట్‌కి పూర్వ వైభవం తీసుకురాగల ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటాడు. 29 ఏళ్ల వయసులో టీ20ల్లో దాదాపు పదివేల పరుగులు చేశాడు.గత నవంబర్‌లో వెస్ట్ ఇండీస్ తరపున 100వ అంతర్జాతీయ టీ20 ఆడాడు. ఇంకో వంద మ్యాచ్‌లు ఆడతానని అనుకున్నాడు. వెస్ట్ ఇండీస్ గెలిచినప్పుడు అభిమానుల ఆనందమే తనని మళ్ళీ ఆడేలా చేస్తుందని చెప్పాడు. వెస్ట్ ఇండీస్ తరపున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ పూరాన్.
కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ కన్నా క్రికెట్ లీగ్‌ల ప్రాబల్యం పెరిగిన ఈ కాలంలో పూరాన్ కూడా లీగ్‌ల వైపు వెళ్ళిపోయాడని అనుకోవచ్చు. ప్రస్తుతం ఏడు లీగ్‌లలో ఆడుతున్నాడు.ఐపీఎల్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, కరేబియన్ ప్రీమియర్ లీగ్, మెన్స్ హండ్రెడ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు. 2024లో ఒక సంవత్సరంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
దీంతో టీ20 లీగ్‌లలో అతని విలువ పెరిగింది. అంతర్జాతీయ మ్యాచ్‌లు తగ్గాయి. 2023 జులైలో చివరిసారిగా వన్డే ఆడాడు. టీ20లో గత డిసెంబర్‌లో ఆడాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్నాడు.ఆండ్రీ రస్సెల్ లాంటి చాలా మంది ఆటగాళ్ళు టీ20 లీగ్‌లు ఆడటానికి సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకుని అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. కానీ పూరాన్ ఆ దారి ఎంచుకోకుండా వీడ్కోలు పలికాడు. ఇకపై పూరాన్ బ్యాటింగ్ లీగ్ మైదానాల్లోనే చూడవచ్చు.