వెస్టిండీస్ బ్యాటర్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఈ నిర్ణయం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగించింది.

వెస్టిండీస్ జట్టులో కీలకంగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్(Nicholas Pooran) తన అంతర్జాతీయ క్రికెట్ (Cricket)ప్రయాణానికి ముగింపు పలికాడు. కేవలం 29ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులు, క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, ఫ్రాంచైజీ టోర్నీల్లో మాత్రం కొనసాగుతానని పూరన్ స్పష్టం చేశాడు.

అంత సులభమైన నిర్ణయం కాదు..

తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పూరన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. చాలా ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయం సులభమైనది కాదని ఆయన తెలిపాడు. వెస్టిండీస్ తరపున ఆడిన ప్రతి మ్యాచ్ తనకు మరిచిపోలేని అనుభవాలను ఇచ్చిందని, దేశ గౌరవాన్ని మోసిన ప్రతి క్షణం తనకు గర్వకారణమని గుర్తు చేశాడు.

పూరన్ కెరీర్‌ను పరిశీలిస్తే, వన్డేల్లో అతను 61 మ్యాచ్‌లు ఆడి 1,983 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో 106 మ్యాచ్‌ల్లో 2,275 పరుగులు చేశాడు. తన ఆగ్రెసివ్ బ్యాటింగ్‌తో టీ20ల్లో ప్రత్యర్థులకు భయాన్ని కలిగించిన పూరన్, ఇటీవల వెస్టిండీస్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

 

View post on Instagram
 

 

2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఎనిమిది నెలల ముందు ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశానికి మరిన్ని సేవలందించాల్సిన అవసరమున్న సమయంలో పూరన్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం వెనుక గల కారణాలు చర్చకు దారితీస్తున్నాయి.ఐపీఎల్‌లోనూ పూరన్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, 14 మ్యాచ్‌ల్లో 524 పరుగులు చేసి తన ధాటిని కొనసాగించాడు. ప్రత్యేకంగా సిక్సర్లతో అలరించాడు.

జీవితాంతం గుర్తుండే…

తన కెరీర్ మొత్తాన్ని వెనక్కి చూసిన పూరన్, క్రికెట్ తనకు ఎన్నో ఇచ్చిందని, తన ప్రయాణంలో తోడైన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. కెప్టెన్‌గా జట్టును నడిపించడం జీవితాంతం గుర్తుండే గౌరవమని పేర్కొన్నాడు.ఈ ప్రకటనతో పాటు పూరన్ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని ఫ్రాంచైజీ లీగ్‌ల ద్వారా కొనసాగించబోతున్నట్లు స్పష్టం చేశారు.