ఖో ఖో వరల్డ్ కప్ 2025: విశ్వవిజేతగా భారత్
Kho Kho World Cup 2025 Final: తొలి ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత పరుషుల జట్టు విశ్వ విజేతగా నిలిచింది. అంతకుముందు భారత మహిళలు కూడా ఖోఖో ప్రపంచ కప్ 2025 టైటిల్ ను సాధించారు.

kho kho world cup 2025: ఖోఖో ప్రపంచ కప్ 2025లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. అద్భుతమైన ఆటతో టోర్నీని ప్రారంభించిన భారత పురుషుల జట్టు టైటిల్‌తో టోర్నీని అద్భుతంగా ముగించింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం (జనవరి 19) జరిగిన తొలి ఖోఖో వరల్డ్ కప్ 2025 టైటిల్ ను గెలుచుకుని క్రీడా చరిత్రలో టీమిండియా తన పేరును ఎప్పటికీ గుర్తుండిపోయేలా లిఖించుకుంది. కెప్టెన్ ప్రతీక్ వైకర్, టోర్నమెంట్ విజేత రాంజీ కశ్యప్ అద్భుత ప్రదర్శనతో నేపాల్ తో జరిగిన ఫైనల్లో మెన్ ఇన్ బ్లూ 54-36 తేడాతో ఘన విజయం సాధించింది. మరో అద్భుతమైన ఫైనల్లో నేపాల్ పై ఆధిపత్యం చెలాయించిన మహిళల జట్టు 78-40 స్కోరుతో ఘన విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది.
ఖోఖో ప్రపంచ కప్ 2025 - చారిత్రాత్మక క్రీడా ఈవెంట్
ప్రారంభ ఖో ఖో ప్రపంచ కప్ ఫైనల్స్ లో అనేక మంది ప్రముఖుల కలయికకు వేదికైంది. ఇది ఈ చారిత్రాత్మక క్రీడా ఈవెంట్ కు ప్రతిష్ఠను పెంచింది. లోక్ సభ మాజీ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిథల్, పార్లమెంటరీ వ్యవహారాలు-మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒడిశా క్రీడలు, యువజన సర్వీసులు, ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్, అంతర్జాతీయ ఖోఖో ఫెడరేషన్ అధ్యక్షుడు సుధాంశు మిట్టల్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణ గోపాల్ జీ పాల్గొన్నారు. సంప్రదాయ భారతీయ క్రీడ నుంచి ఒలింపిక్ క్రీడగా ఎదిగే మార్గంలో ఖోఖో ప్రయాణంలో ఈ మైలురాయి సంఘటన ప్రాముఖ్యతను వారి హాజరు చాటిచెప్పింది.
రామ్ జీ కశ్యప్ అద్భుత స్కై డైవ్ తో అటాక్ మొదలుపెట్టిన టీమిండియా
తొలుత అటాక్ మొదలుపెట్టిన భారత జట్టుకు రామ్ జీ కశ్యప్ అద్భుత స్కై డైవ్ తో నేపాల్ ఆటగాడు సూరజ్ పుజారాను ఔట్ చేశాడు. ఆ తర్వాత సుయాష్ గార్గేట్ భారత్ సాహును తాకి కేవలం 4 నిమిషాల్లోనే 10 పాయింట్లతో భారత్ కు శుభారంభం అందించాడు. మెన్ ఇన్ బ్లూ అద్భుతమైన ఆటతో టర్న్ 1 లో జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఇది వారి ప్రత్యర్థులకు డ్రీమ్ రన్ ను నిరోధించింది. ఆట ముగిసే సమయానికి స్కోరు 26-0తో భారత జట్టుకు అనుకూలంగా నిలిచింది.
టర్న్ 2లో నేపాల్ టీంఇండియా స్థాయికి సరితూగలేకపోయినప్పటికీ జట్టును ఒక్క డ్రీమ్ రన్ కు కూడా వెళ్లకుండా అడ్డుకుంది. ఆదిత్య గన్పులే, కెప్టెన్ ప్రతీక్ వైకర్ జట్టును ఈ టర్న్ లో భారత్ ను ముందుంచారు. జనక్ చంద్, సూరజ్ పుజారా వంటి వారి క్రమం తప్పకుండా స్పర్శించినప్పటికీ, జట్టు రెండవ అర్ధభాగంలో 26-18 ఆధిక్యంలో నిలిచింది.
భారత జోరును ఆపలేకపోయిన నేపాల్
టర్న్ 3లో భారత్ తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించింది. కెప్టెన్ ప్రతీక్ వైకర్ పలు స్కై డైవ్ లతో చాపకింద నీరులా మెరిశాడు. టోర్నమెంట్ లో మరో స్టార్ రామ్ జీ కశ్యప్ సహకారంతో కెప్టెన్ భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. ఆదిత్య గన్పులే కూడా తన అత్యుత్తమ ఆటతీరును కనబరిచాడు. జట్టు సమిష్టిగా రాణించి స్కోరును 54-18 కు తీసుకువెళ్ళింది.
చివరి టర్న్ లో టీమిండియాతో నేపాల్ తీవ్రంగా పోరాడింది. కానీ ప్రతీక్ వైకర్ నేతృత్వంలోని డిఫెండర్లు, ఈసారి సచిన్ భార్గో - చింగారి అని ముద్దుగా పిలుచుకునే ప్లేయర్ తన పవర్ ను చూపించాడు. మెహుల్, సుమన్ బర్మన్ లు సమానంగా రాణించడంతో ఫైనల్ ముగిసే సమయానికి స్కోరు 54-36తో ముగియడంతో టీమ్ ఇండియాకు ట్రోఫీ దక్కింది.
ఖోఖో ప్రపంచ కప్ 2025 - ఒక్క ఓటమి లేకుండా సత్తా చాటిన భారత్
తొలి ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత జట్టు ప్రయాణం అద్భుతమైనది. గ్రూప్ దశలో బ్రెజిల్, పెరూ, భూటాన్ లపై ఘన విజయం సాధించడంతో టోర్నీ అంతటా భారత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాకౌట్ రౌండ్ల వరకు వారి జోరు కొనసాగింది, క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ ను ఓడించింది. ఇక సెమీఫైనల్లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో నేపాల్ ను చిత్తుచేసి తొలి ఖోఖో ప్రపంచ కప్ 2025 ఛాంపియన్ గా భారత్ నిలిచింది.
ఖోఖో ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ అవార్డులు
బెస్ట్ అటాకర్ ఆఫ్ ద మ్యాచ్: సుయాష్ గార్గేట్ (టీమిండియా)
బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్: రోహిత్ బర్మా (నేపాల్ జట్టు)
బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: మెహుల్ (టీమిండియా)

