ఐపీఎల్ 2025లో టాప్ 2 స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా.. ముందుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్ సోమవారం (మే 26) పోటీలో తలపడుతోంది.

ఇప్పటికే 13 మ్యాచ్‌లు ఆడి 17 పాయింట్లు సొంతం చేసుకున్న పంజాబ్ రెండో స్థానంలో ఉండగా, ముంబయి ఇండియన్స్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉండే జట్లు ఫైనల్‌కు చేరేందుకు అదనపు అవకాశం పొందుతాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లు కూడా తమ గేమ్‌పై పూర్తి దృష్టి పెట్టాయి. సీజన్ ఆరంభంలో జట్టు నిలకడగా ఆడలేకపోయినా, ముంబై ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించి పునరాగమనం చేసింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు బలమైన ఆటగాళ్లతో బ‌లంగా ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ఫామ్‌లో ఉండడం ముంబయికు బలాన్ని ఇస్తోంది.

బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ 583 పరుగులతో అద్భుతంగా రాణిస్తున్నాడు. రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. తిలక్ వర్మ పూర్తిగా రాణించకపోయినా, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్‌లు ఫినిషింగ్ డ్యూటీలో కీలకంగా నిలుస్తున్నారు.

పంజాబ్ కింగ్స్ చాలా రోజుల తర్వాత ప్లేఆఫ్స్‌కి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 11 ఏళ్ల తర్వాత ఈ జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించడంలో ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (486 పరుగులు), ప్రియాంశు ఆర్య (362 పరుగులు) కీలక పాత్ర పోషించారు. గత మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా, మార్కస్ స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఇదే రకంగా, ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటుండటం పంజాబ్ విజయాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.

ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి:

చిన్న బౌండరీలు ఉన్న జైపూర్ మైదానం బ్యాటర్లకు సహకరిస్తుంది. ఇరు జట్లు బ్యాటింగ్‌లో సమానంగా ఉన్నా, బుమ్రా లాంటి ఫామ్ బౌలర్‌తో ముంబయికు కొంత ముందంజలో ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ టాప్ 2లో చోటు దక్కించుకునే జట్టును నిర్ణయించవచ్చు. మ‌రి ఈ మ్యాచ్‌లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.