రోహిత్ శర్మ జట్టుపై ప్రీతి జింటా దుమారం: మండిపడుతున్న ఫ్యాన్స్

ipl 2018, priety zinta, mu,bai indians, kings ix punjab
Highlights

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ జట్టు ఓటమిపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, సినీ నటి ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

పూణే: ముంబై ఇండియన్స్ ఐపిఎల్ జట్టు ఓటమిపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, సినీ నటి ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.  ఆదివారం చెన్నై-పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఆమె హాజరైంది. 

ముంబై ఇండియన్స్ జట్టుపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో కలకలం రేపుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ముంబై అభిమానులు ఆమెపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. ఆ విషయం తమ జట్టు మ్యాచ్ కోసం పూణేలో ఉన్న ప్రీతిజింటాకు తెలిసింది. 

దీనికి ఆమె తెగ ఆనందపడిపోయి "నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముంబై ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. చాలా హ్యాపీగా ఉంది" అని తన పక్కన ఉన్న వ్యక్తితో అన్నట్లు టీవీలో ప్రసారమైంది.దాన్ని మొబైల్‌లో వీడియో తీసిన ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆమెపై ముంబై అభిమానులు సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టారు.
 
ఆమె ఆనందానికి కారణాలు లేకపోలేదు. తమ పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవాలి. అలాగే చెన్నై జట్టును పంజాబ్ 53 పరుగుల తేడాతో ఓడించాలి. 

ఆమె కోరుకున్నట్లు ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఆమె సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. పంజాబ్ కూడా చెన్నై చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో పంజాబ్ జట్టు కూడా ప్లేఆఫ్ స్థానాన్ని కోల్పోయింది.

loader