India vs Pakistan Final: భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు మూడోసారి తలపడబోతున్నాయి. ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌లలో టీమిండియా పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
IND vs PAK Asiacup 2025 Final: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో బంగ్లాదేశ్‌ను 11 పరుగుల తేడాతో ఓడించింది పాకిస్థాన్. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా పాక్ బౌలర్లు అదరగొట్టారు.
బంగ్లాదేశ్ పై విజయంతో పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్లో మరోసారి టీమిండియాతో తలపడే అవకాశాన్ని పొందింది. ఇలా ఇండియా-పాకిస్థాన్ ఈ మెగా టోర్నీలో తలపడటం ఇది మూడోసారి. ఇంతకుముందు గ్రూప్ స్టేజ్, సూపర్ ఫోర్ రౌండ్‌లలో ఇరు జట్లు తలపడ్డాయి.
తొమ్మిదో ఆసియా కప్ టైటిల్‌పై భారత్ కన్ను
భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగనుంది. ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ను వరుసగా మూడోసారి ఓడించాలని చూస్తుంటే, మరోవైపు పాకిస్థాన్ గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఆసియా కప్ కిరీటాన్ని గెలవాలని పట్టుదలగా ఉంది. టీమిండియా ఇప్పటివరకు 8 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలుచుకోగా, పాకిస్థాన్ కేవలం 2 సార్లు మాత్రమే ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ హెడ్ టు హెడ్ రికార్డులు
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే, ఇప్పటివరకు టీ20ల్లో టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య మొత్తం 5 మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత జట్టు 4 గెలిచింది, పాకిస్థాన్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. 2016 ఆసియా కప్ టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది, ఆ తర్వాత 2022 ఆసియా కప్ టీ20లో మొదట భారత్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించగా, తర్వాత పాక్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈసారి భారత జట్టు ఇప్పటికే 2 మ్యాచ్‌లు గెలిచింది, మూడో విజయంపై కన్నేసింది.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ ప్రదర్శన
ఆసియా కప్ 2025లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు మొత్తం 3 మ్యాచ్‌లు, సూపర్ ఫోర్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు గెలిచింది. మొత్తం 5 మ్యాచ్‌లలో టీమిండియా ప్రత్యర్థి జట్లను ఏకపక్షంగా ఓడించింది, ఇందులో రెండుసార్లు పాకిస్థాన్ కూడా ఉంది. ఇక పాకిస్థాన్ విషయానికొస్తే, ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు గెలిచి, 2 ఓడిపోయింది. అంతేకాకుండా, జట్టు బ్యాటింగ్ కూడా చాలా బలహీనంగా కనిపించింది.
టీమిండియా స్క్వాడ్: శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రింకు సింగ్, అర్ష్‌దీప్ సింగ్.
పాకిస్థాన్ స్క్వాడ్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సామ్ అయూబ్, హుస్సేన్ తలత్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, అబ్రార్ అహ్మద్, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్, మహమ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, సూఫియాన్ ముఖీమ్, ఖుష్దిల్ షా.


