India Pakistan Handshake Controversy : ఆసియా కప్ 2025 ఇండియా, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్ లేకపోవడం వివాదంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చిక్కుకున్నారు.
India Pakistan Handshake Controversy : ఆసియా కప్ 2025లో హైఓల్టేజ్ మ్యాచ్ నిన్న(ఆదివారం) దుబాయ్‌లో ముగిసింది. ఎంతో ఉత్కంఠగా ఇటు ఇటు ఇండియా, అటు పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూసిన మ్యాచ్ లో మరోసారి టీమిండియాదే విజయం. పాక్ క్రికెటర్లు భారతజట్టుముందు నిలవలేకపోయారు. ఇలా ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సక్సెస్ ఫుల్ గా ముగిసినా ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్ (కరచాలనం) లేకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వివాదంలో చిక్కుకున్నారు.
మ్యాచ్ ముందు, తర్వాత నో హ్యాండ్‌షేక్
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు, మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్ళు హ్యాండ్‌షేక్‌లు చేసుకోకపోలేదు. ఇలా భారత్, పాక్ ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది. అయితే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నది కాదు… బీసీసీఐ, భారత ప్రభుత్వంతో చర్చల తర్వాత తీసుకున్నామని అంటున్నారు.
‘’మేము ఇక్కడికి ఆట ఆడటానికి మాత్రమే వచ్చాం. మా ఆటతోనే ప్రత్యర్ధికి సరైన సమాధానం ఇచ్చాం” అని సూర్యకుమార్ మ్యాచ్ అనంతరం వెల్లడించారు. అంటే ముందుగానే పాకిస్థాన్ ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండకూడదని భారత క్రికెటర్లకు ఆదేశాలు అందాయని సూర్యకుమార్ మాటలను బట్టి అర్థమువుతోంది.
పాకిస్తాన్ నిరాశ
భారత్ చేతితో ఓడిన బాధలో ఉన్న పాకిస్తాన్ కు ఈ షేక్ హ్యాండ్ వ్యవహారం మరింత ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్లు కొద్దిసేపు మైదానంలోనే ఉన్నారు… కానీ భారత ఆటగాళ్లు ఎంతకూ రాకపోవడంతో వారు కూడా పెవిలియన్ బాటపట్టారు. భారత్ తీరుతో పాక్ ఆటగాళ్లు నిరాశచెందారని ఆ టీం హెడ్ కోచ్ మైక్ హెస్సన్ తెలిపారు. అందుకే పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా తప్పనిసరిగా మ్యాచ్ అనంతర పాల్గొనాల్సిన ఇంటర్వ్యూలో పాల్గొనలేదని తెలిపారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది. జట్టు మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై అధికారికంగా నిరసన తెలిపారని ధ్రువీకరించింది. టాస్ సమయంలో కెప్టెన్లు హ్యాండ్‌షేక్‌లు చేసుకోవద్దని మ్యాచ్ రిఫరీ కోరారని పాకిస్థాన్ ఆసక్తికర ఆరోపణలు చేసింది.
షేక్ హ్యాండ్ వివాదంలో రిఫరీ పైక్రాఫ్ట్
పీసీబీ ఆరోపణ పైక్రాఫ్ట్‌ను వివాదంలోకి నెట్టింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే హ్యాండ్‌షేక్‌లు చేసుకోవద్దని ఇద్దరు కెప్టెన్లకు ఆయన సూచించారని ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదుపై ఆయన అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. పీసీబీ తన ప్రకటనలో ఇంకో అడుగు ముందుకేసి ఇండియా చర్యలను “క్రీడా స్ఫూర్తికి విరుద్ధం”గా అభివర్ణించింది.
రాజకీయ కారణాలు..
ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రత్యర్థుల మధ్య ఇదే తొలి మ్యాచ్. పహల్గాం ఘటన ఇరుదేశాల సంబంధాలను పూర్తిగా దెబ్బతీసింది. పాకిస్థాన్ తో మ్యాచ్ ను ఇండియా నిషేధించాలనే డిమాండ్ ఇండియన్స్ నుండి బలంగా వినిపించింది. కానీ కేంద్రం ద్వైపాక్షిక టోర్నమెంట్లలో కాకుండా ఐసిసి టోర్నమెంట్లలో మాత్రమే పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడేందుకు అనుమతి ఇచ్చింది.
పాకిస్థాన్ పై విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేస్తూ కెప్టెన్ సూర్యకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “క్రీడా స్ఫూర్తి కంటే ముందు జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి. ప్రెజెంటేషన్‌లో కూడా నేను చెప్పాను. పహల్గాం ఉగ్రదాడి బాధితులందరితో, వారి కుటుంబాలతో మేము నిలబడతాం, మా సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం” అని ఆయన అన్నారు.
