IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !
Mumbai Indians: ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ 16న అబుధాబిలో జరగనుంది. ముంబై ఇండియన్స్ కోచ్ మాహేల జయవర్ధనే, వేలంలో దేశీయ ఆటగాళ్లపై దృష్టి సారిస్తామనీ, జట్టు ప్రధాన ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతామని స్పష్టం చేశారు.

ఐపీఎల్ 2026 వేలానికి సర్వం సిద్ధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్ 16న అబుధాబిలో జరగనుంది. ఈ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆయా జట్లన్నీ కూడా తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను ఇప్పటికే ప్రకటించాయి.
వేలం కోసం నమోదు చేసుకున్న 1355 మంది ఆటగాళ్లలో తుది జాబితాను త్వరలోనే ప్రకటించనున్నారు. మరోసారి అందరి దృష్టి ఆకర్షిస్తోంది ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టు. వేలంతో పాటు రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని సమాచారం.
ముంబై ఇండియన్స్ జట్టు ఎప్పటి నుంచో తమ వేలం విధానంలో ఎక్కువ మంది దేశీయ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ముంబై ఫ్రాంఛైజీ, అత్యంత దిగువ స్థాయి నుండి ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి, వేలంలో వారిని కొనుగోలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈ వ్యూహమే వారి విజయాలకు ఒక ప్రధాన కారణంగా ఉంది.
IPL వేలం కోసం కోచ్ మాహేల జయవర్ధనే ప్లానేంటి?
ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్ మాహేల జయవర్ధనే, రాబోయే ఐపీఎల్ వేలంలో జట్టు వ్యూహాలపై కీలక విషయాలను వెల్లడించారు. తాము అన్‌క్యాప్డ్ దేశీయ ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి తమ ప్రధాన ఫోకస్ వారిపైనే అంటూ పేర్కొన్నాడు.
ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ జయవర్ధనే ఈ వివరాలను వెల్లడించారు. "ముంబై ఇండియన్స్ జట్టు ఎల్లప్పుడూ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్ల కోర్ గ్రూప్‌పైనే ఆధారపడుతూ ముందుకు సాగుతుంది" అని జయవర్ధనే అన్నారు. ఈ ఆటగాళ్లు జట్టుకు వెన్నెముకగా నిలుస్తారని ఆయన వివరించారు.
ముంబై జట్టు బలంపై కోచ్ కామెంట్స్ వైరల్
ముంబై జట్టు బలం గురించి జయవర్ధనే మాట్లాడుతూ.. "గత సీజన్‌లో ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టులోకి రావడంతో టీమ్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది. మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం ఫ్రాంఛైజీ బలాన్ని మరింత పెంచారు" అని అన్నారు.
యువ ఆటగాళ్ల గురించి మాల్లాడుతూ.. "మా జట్టులోని యువ ఆటగాళ్లు గత సీజన్ నుండి తమ ఆటతీరులో చాలా మెరుగుదల చూపించారు. ఈ సంవత్సరం తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని మేము ఆశిస్తున్నాము" అని జయవర్ధనే అన్నారు.
ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు
ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు తీసుకున్న నిర్ణయాలను మాహేల జయవర్ధనే వెల్లడించారు. వేలంలో తమ దృష్టి దేశీయ ఆటగాళ్లపైనే ఉంటుందని పునరుద్ఘాటించారు. వేలానికి ముందు ముంబై ఇండియన్స్ మొత్తం ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది.
విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో కర్ణ్ శర్మ, బెవొన్ జాకబ్స్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, విఘ్నేష్ పుత్తూర్, కేఎల్ శ్రీజిత్, పిఎస్ఎన్ రాజు, రీస్ టోప్లీ, లిజార్డ్ విలియమ్స్ ఉన్నారు. ఈ ఏడుగురితో పాటు, యువ ఆటగాడు అర్జున్ టెండూల్కర్‌ను ట్రేడ్ (బదిలీ) ద్వారా మరో జట్టుకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మార్పులు జట్టు కూర్పులో మరింత సమతూకం తీసుకురావడానికి ఉద్దేశించినవిగా భావిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ గత ఐపీఎల్ సీజన్ల ప్రదర్శన ఎలా ఉంది?
ముంబై ఇండియన్స్ జట్టు 2020లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అప్పటి నుండి టైటిల్ కోసం జట్టు ఎదురుచూస్తోంది. గత సీజన్ లో జట్టు పేలవమైన ఆరంభం తర్వాత అద్భుతంగా పుంజుకుంది. 2025 లో నాలుగవ స్థానంలో నిలిచి సీజన్‌ను ముగించింది.
అయితే, ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అత్యంత నిరాశపరిచింది. జట్టు ఆ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. 2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం, ఆ సీజన్‌లో జట్టు వైఫల్యం తర్వాత, అంతర్గత విభేదాల వార్తలకు దారితీసింది.
అయితే, 2025లో జట్టు ప్రదర్శన మెరుగుపడినప్పటికీ, ముంబై ఇండియన్స్ టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో టైటిల్ గెలవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ, అభిమానులు గట్టి ఆశతో ఉన్నారు. కోచ్ జయవర్ధనే చెప్పిన విధంగా, వేలంలో దేశీయ ప్రతిభావంతులపై ఆధారపడటం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు.

