‘నా కూతుళ్లను చూస్తుంటే భయమేస్తోంది’

I fear my girls will ask me meaning of the word rape, says Gautam Gambhir
Highlights

గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

తనకు 14 ఏళ్లు వచ్చాక రేప్ అంటే ఏంటో తెలిసిందని, కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని టీమిండియా వెటరన్ ప్లేయర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో 'చైల్డ్ రేప్'పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ తన కూతుళ్లను చూస్తుంటే భయమేస్తోందని అన్నాడు. దేశంలో నిత్యం వెలుగుచూస్తున్న రేప్ ఘటనల నేపథ్యంలో 'రేప్' అంటే ఏంటని తన కూతుళ్లు ఎక్కడ అడుగుతారోనని భయంగా ఉందని, అదే గనుక జరిగితే వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన చెందాడు.

ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆడపిల్లల తండ్రిగా తాను తీవ్ర ఆందోళనకు గురవుతున్నానని గంభీర్ వెల్లడించాడు. పిల్లలకు చిన్నతనం నుంచే వ్యక్తుల స్పర్శల్లోని బేధాల గురించి వివరించాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నాడు. స్కూళ్లలో పిల్లలకు తప్పనిసరిగా మంచి స్పర్శ, చెడు స్పర్శకు మధ్య బేధాన్ని వివరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

మైనర్లు సైతం తమ తోటివారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గంభీర్ అన్నాడు. రేప్ అనేది భౌతికదాడి మాత్రమే కాదని, నమ్మక ద్రోహం అని చెప్పుకొచ్చాడు. దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటమేనని గంభీర్ అన్నాడు.

దీనికి తోడు తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడం కూడా ఒకటని గంభీర్ అన్నాడు. తద్వారా చిన్నపిల్లలు సైతం ఇంటర్నెట్‌లో పోర్న్ కోసం వెతుకుతున్నారని గంభీర్ చెప్పాడు. దీని ఫలితంగానే, అత్యాచారాలకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.


'ప్రస్తుతం నా నాలుగేళ్ల కూతురు ఆజీన్ ఆమె తల్లిచెబుతున్న ప్రకారం.. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బేర్, సి ఫర్ క్యాట్ అనే పదాలు ఉచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో ఏదోఒక రోజు ఏ ఫర్ అబ్యూజ్(వేధించడం), బి ఫర్ బ్రూచువల్లీ(దారుణంగా), సి ఫర్ క్రూయాల్టీ(క్రూరంగా) అనే పదాలను ఉచ్చరిస్తున్నట్లు వినిపిస్తుందేమనని పీడకలలు వస్తున్నాయి' అని గంభీర్ ఆవేదన చెందాడు.

loader