టీంఇండియా  ఆటగాడు హార్దిక్ పాండ్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓ టివి షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇతడిపై ఇప్పటికే బిసిసిఐ రెండు వన్డేల నిషేధాన్ని విధించింది. తాజాగా పాండ్యా గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ముంబైలోని ప్రతిష్టాత్మక క్లబ్ ''ఖర్ జింఖానా" ప్రకటించింది. సోమవారం జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ సందర్భంగా ఖర్‌ జింఖానా సంయుక్త కార్యదర్శి గౌరవ్‌ కపాడియా మాట్లాడుతూ...మహిళలను అవమానిస్తూ పాండ్యా చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే అతడి గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు మేనేజింగ్ కమిటీ సభ్యులందరు పాండ్యా సభ్యత్వ రద్దుకు ఆమోదం తెలిపారని...ఇప్పటినుండి అతడు తమ క్లబ్ సభ్యుడు కాడని గౌరవ్‌ కపాడియా పేర్కొన్నారు. 

ఇటీవల ఓ జాతీయ టివి ఛానల్లో ప్రసారమయ్యే కాఫీ విత్ కరణ్ షో కార్యక్రమంలో టీంఇండియా యువ ఆటగాళ్ళు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ అడిగిన పలు ప్రశ్నలకు హార్థిక్ పాండ్యా మహిళలను కించపర్చేలా జవాబులిచ్చాడు. తన వ్యక్తిగత లైంగిక వ్యవహారాల గురించి తల్లిదండ్రులతో చర్చించినట్లు కూడా పాండ్యా తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు, ప్రజలు,మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదాస్పదమయ్యాయి.  

దీంతో హార్దిక్ తో పాటు రాహుల్ పై కూడా బిసిసిఐ రెండు వన్డేల నిషేదాన్ని విధించింది. పాండ్యా, రాహుల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పినా సంతృప్తి చెందని అధికారులు క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే వీరిపై చర్యలకు దిగింది.  

సంబంధిత వార్తలు

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్