Gukesh vs Carlsen: నార్వే చెస్ 2025లో మ్యాగ్నస్ కార్ల్‌సన్‌పై భారత చెస్ గ్రాండ్ మాస్టర్ డీ.గుకేష్ విజయం సాధించాడు. అయితే, ఈ గెలుపు తర్వాత చోటుచేసుకున్న కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Gukesh stuns Carlsen at Norway Chess 2025: భారత చెస్ యంగ్ గ్రాండ్‌మాస్టర్ డీ.గుకేష్ నార్వే చెస్ 2025 టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ నెంబర్ వన్ మ్యాగ్నస్ కార్ల్‌సన్‌పై తన తొలి క్లాసికల్ గేమ్ విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఆరో రౌండ్‌లో గుకేష్ ఒక సమయంలో ఓడిపోయే స్థితిలో ఉన్నాడు. అయితే, అద్భుతంగా పునరాగమనం చేసి మ్యాచ్‌ను గెలుచుకోవడం విశేషం.

ఈ గెలుపుతో గుకేష్, ఈ టోర్నీ చరిత్రలో కార్ల్‌సన్‌ను ఓడించిన రెండవ భారత చెస్ ఆటగాడిగా నిలిచాడు. ఇదివరకు ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌పై గెలిచాడు. మ్యాచ్ తర్వాత చెస్.కామ్‌తో గుకేష్ మాట్లాడుతూ.. "ఇది నేను కోరుకున్న విధంగా కాదు, కానీ ఈ గెలుపు ప్రత్యేకం" అని పేర్కొన్నాడు.

ఓటమిని తట్టుకోలేకపోయిన మ్యాగ్నస్ కార్ల్‌సన్‌ 

మ్యాచ్ తర్వాత కార్ల్‌సన్ ఓటమిని తట్టుకోలేకపోయాడు. తన అసహనాన్ని అందరిముందే వ్యక్తం చేశాడు. చెస్ బోర్డుపై బలంగా చేత్తో బాదాడు. దీంతో బోర్డుపై ఉన్న చెస్ ముక్కలు కిందపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, అతను గుకేష్ చేతిని పట్టుకుని అభినందించడాన్ని మాత్రం మరచిపోలేదు. అక్కడి నుంచి వెళ్తూ గుకేష్ ను అభినందిస్తూ చేత్తో భూజం తట్టాడు. గుకేష్ కూడా మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనయ్యాడు. తన సీటులోంచి లేచి కొద్ది సేపు తన చేతులను నోటిపై పెట్టుకుని కనిపించాడు.

 

Scroll to load tweet…

 

100 సార్లు ఆడితే 99 సార్లు నేనే ఓడేవాడిని : గుకేష్ కామెంట్స్ వైరల్ 

ఈ గేమ్‌ పై గుకేష్ మాట్లాడుతూ, "100 సార్లు ఆడితే 99 సార్లు నేనే ఓడేవాడిని. కానీ ఈ రోజు అదృష్టం నా వెంట ఉంది. ఈ గెలుపు చాలా ప్రత్యేకం" అని చెప్పాడు. మ్యాచ్‌లో ఎక్కువ భాగం కార్ల్‌సన్ ఆధిపత్యం కొనసాగించాడు. కానీ చివర్లో సమయ ఒత్తిడితో తన పట్టును కోల్పోయాడు. దీంతో 19 ఏళ్ల గుకేష్ దానిని సద్వినియోగం చేసుకొని విజయం సాధించాడు.

ఈ గెలుపుతో గుకేష్ 8.5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం కార్ల్‌సన్ (9.5), అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కారువానా (9.5) కంటే కేవలం ఒక్క పాయింట్ తక్కువగా ఉన్నాడు.

ఆ విషయంలో గుకేష్ కు క్రెడిట్ ఇవ్వాలి : గ్రాండ్‌మాస్టర్ విష్ణు ప్రసన్న

గుకేష్ కోచ్, గ్రాండ్‌మాస్టర్ విష్ణు ప్రసన్న మాట్లాడుతూ.. "గుకేష్ తలవంచని ధైర్యం, తడబడని పోరాటతత్వానికి చాలా క్రెడిట్ ఇవ్వాలి. అతను చాలా భాగం ఓటమి దశలో ఉన్నా చివరి వరకూ పోరాడాడు. ఇప్పుడు అతను ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉన్నాడు" అని ప్రశంసించారు. ఇంతకుముందు, మే 27న జరిగిన మొదటి రౌండ్‌లో కార్ల్‌సన్ తన క్లాసికల్ చెస్‌కు తిరిగొచ్చిన తొలి గేమ్‌లోనే గుకేష్‌ను ఓడించాడు. కానీ ఆరో రౌండ్‌లో గుకేష్ ప్రతీకారం తీర్చుకున్నాడు.