ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన మ్యాచులో ధోనీ సేన రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన మ్యాచులో ధోనీ సేన రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ నేరుగా పైనల్లోకి ప్రవేశించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ చైన్నై ముందు 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిజానికి, మంచి ఊపు మీదున్న చెన్నైకి అదేమంత పెద్ద లక్ష్యం కాదు. కానీ, హైదరాబాద్ బౌలర్లు పని గట్టుకుని వరుసగా వికెట్లు తీస్తూ వెళ్లారు. ఈ సమయంలో చెన్నైకి ఓటమి తప్పదనిపించింది. కానీ డూప్లెసిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ చెన్నైని గెలిపించింది. చివరలో డూప్లెసిస్ ఒంటరి పోరాటం చేశాడు. హర్భజన్ సింగ్ అవుట్ కావడంతో చెన్నై 17.5 ఓవర్లలో 113 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. అప్పటికి 13 బంతుల్లో చెన్నై విజయానికి 27 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ 39 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయింది. షేన్‌వాట్సన్ డకౌట్‌గా తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరగా, సురేశ్ రైనా(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఈ సీజన్ లో బాగా రాణిస్తున్న అంబటి రాయుడు డకౌట్ అయ్యాడు. దాంతో చెన్నై 24 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది.
ఆ తర్వాత మరో 15 పరుగుల వ్యవధిలో కెప్టెన్ ధోని(9) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సన్‌రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన గూగ్లీని అంచనా వేయడంలో ధోనీ విఫలమయ్యాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ కూడా విఫలమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన‍్నింగ్స్ తొలి బంతికే శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత విలియమ్సన్‌తో కలిసి 34 పరుగులు జత చేసిన గోస్వామి(12) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
మరో రెండు పరుగుల వ్యవధిలో కేన్ విలియమ్సన్(24) కూడా పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకిబుల్ హసన్(12) అవుటయ్యాడు. ఆ తర్వాత యూసఫ్ పఠాన్(24) ఫర్వాలేదనిపించాడు.
చివర్లో హిట్టర్ బ్రాత్‌వైట్(43 నాటౌట్; 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రేవో రెండు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.
