మూసలో కొట్టుకుపోతున్న భారత క్రికెట్ జట్టులో వేగాన్ని నింపి... ఇండియన్ క్రికెట్‌ను విజయాలకు కేరాఫ్‌‌గా మార్చిన ఘనత మహేంద్ర సింగ్ ధోనిదే. అన్ని ఫార్మాట్లలోనూ జట్టును నెంబర్‌వన్‌గా నిలపడమే కాకుండా.. వన్డే, టీ20, మిని వరల్డ్‌కప్‌లను అందించిన ఏకైక కెప్టెన్. ఎంతటి ఒత్తిడిలోనైనా సహనం కోల్పోకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ధోనిని ఆదర్శంగా తీసుకోవాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తూ ఉంటారు. అలాంటి ధోని ఒక చిన్నారి కోసం తనను తాను మార్చుకున్నాడు. ఆమె ఎవరో కాదు. మహేంద్రుడి గారాలపట్టి జీవా.. తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనను ప్రపంచంతో పంచుకునే ఎంఎస్.. ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాల గురించి మాత్రం నోరు విప్పడు.. కానీ మొదటిసారిగా ఓ టీవీ షోలో తండ్రిగా కూతురితో ఉన్న అనుబంధాన్ని వెల్లడించాడు..

ఆడపిల్లలందరికి తండ్రి అంటే ఎంతో ఇష్టం.. వారు తల్లితో కంటే తండ్రి వద్ద గడపటానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు.. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదు.. జీవా పుట్టినప్పుడు నేను తన దగ్గరలేను.. ఆ సమయంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువ సమయం క్రికెట్‌లోనే గడిచిపోయిందని.. ఈ మధ్యలో నా పేరు చెప్పి జీవాకు భయం చెప్పేవారని.. అన్నం తినకపోతే.. నాన్న వస్తున్నాడు.. అని బెదిరించేవారని.. అలా నాన్న అంటే ఏదో తెలియని భయాన్ని ఆమెలో కల్పించారని ధోని తెలిపాడు. ఇంటికి రాగానే జీవాను దగ్గరకు తీసుకోవాలనుకుంటే.. తను మాత్రం భయంతో దూరంగా ఉండేదని అన్నాడు. అయితే ఐపీఎల్-8 కారణంగా నా బిడ్డతో దూరం తగ్గిందని.. జీవాతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం దొరికిందని ధోని  సంతోషం వ్యక్తం చేశాడు. నేను 1.30, 2.30, 3 గంటలకు నిద్రలేచేవాడినని.. జీవా మాత్రం 9 గంటల్లోపే లేచి బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని పిల్లలతో ఆడుకునేదని.. దానిని చూసి ఎంతో సంతోషంగా ఉండేదని ధోని ఉద్వేగంంగా తెలిపాడు. ఇంగ్లండ్ టూర్‌కు సమయం ఉండటంతో ఈ సమయాన్ని జీవాతో గడుపుతానని ధోని తెలిపాడు.