కేంద్ర ప్రభుత్వం ప్రొమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు కారణంగా పలు గేమింగ్ యాప్స్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
KNOW
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం ప్రకటించింది. BCCI, Dream11 మధ్య ఉన్న రూ. 358 కోట్ల జెర్సీ స్పాన్సర్‌షిప్ ఒప్పందం ముగిసింది.
కొత్త గేమింగ్ చట్టం ప్రభావం
2025లో కేంద్ర ప్రభుత్వం ప్రొమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. దీనివల్ల రియల్ మనీ గేమింగ్ యాప్‌లు ప్రకటనలు, స్పాన్సర్‌షిప్ చేయడంపై నిషేధం విధించారు. దీని ప్రభావంతోనే Dream11 తన రియల్ మనీ గేమింగ్ ఆపరేషన్లను మూసివేసింది.
BCCI కార్యదర్శి దేవచిత్ సైకియా ఈ విషయమై మాట్లాడుతూ.. “బోర్డు ఇకపై ఇలాంటి సంస్థలతో ఎప్పటికీ ఒప్పందం కుదుర్చుకోదు. Dream11తో సంబంధం ముగుస్తోంది” అని తెలిపారు. Dream11 2023లో మూడు సంవత్సరాల ఒప్పందంతో టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా మారింది. 2023లో దాని పేరెంట్ కంపెనీ Dream Sports సుమారు రూ. 2,964 కోట్లు ప్రకటనలు, ప్రమోషన్లపై ఖర్చు చేసింది. మొత్తం ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్స్ కలిపి ప్రతి సంవత్సరం రూ. 5,000 కోట్లకు పైగా మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తున్నాయి. కొత్త చట్టం వల్ల ఈ వ్యాపార వ్యవస్థ పెద్దగా దెబ్బతింటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఆసియా కప్ ప్రారంభానికి కొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. BCCIకి కొత్త జెర్సీ స్పాన్సర్ దొరకడానికి చాలా తక్కువ సమయం ఉంది. అయితే భారత క్రికెట్‌లో ఇది అత్యంత విలువైన ఆస్తి కావడంతో, కొత్త స్పాన్సర్ దొరకడంలో పెద్ద ఇబ్బంది ఉండదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
గతంలో సహారా, బైజూస్ వంటి సంస్థలు కూడా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించిన తర్వాత ఆర్థిక లేదా న్యాయ సమస్యలు ఎదుర్కొన్నాయి. ఈ ధోరణిని పరిశ్రమలో “జెర్సీ జింక్స్” అని పిలుస్తున్నారు. ఇప్పుడు Dream11 కూడా అదే జాబితాలో చేరినట్టైంది. మరి కొత్తగా వచ్చే సంస్థ ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
