హైదరాబాద్: కేవలం ఆరు నిముషాల వ్యవధిలో రొమేలు లుకాకు చేసిన రెండు గోల్స్ బెల్జియం‌కు ఘన విజయాన్ని తెచ్చి పెట్టింది. సోచిలోని ఫిస్ట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జి మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో పనామాను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇంతటి ఘనతకు కారణమైన రొమేలు లుకాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 


ఫస్టాఫ్‌లో రెండు టీమ్స్‌లో ఏ ఒక్కటీ ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. సెకండాఫ్ వచ్చేసరికి మొదటి నిముషంలోనే తొలి గోల్ చేయడం ద్వారా బెల్జియం టీమ్ మ్యాచ్‌కు ఊపు తెచ్చి పెట్టింది. 47వ నిమిషంలో మెర్టెన్స్‌ గోల్‌ చేసి జట్టుకు 1-0 ఆధిక్యతను సంపాదించిపెట్టాడు. పెనాల్టీ కార్నర్‌ నుంచి విక్టర్‌ కైవెన్లో కొట్టిన బంతిని డ్రైస్‌ మెర్టెన్స్‌ తలతో బంతిని చాకచక్యంగా గోల్‌లోకి పంపి ఆ జట్టుకు ఆధిక్యతను చేకూర్చాడు. 


65వ నిమిషంలో పనామా డిఫెండర్‌ హజార్డ్‌ ప్రమాదకరంగా బెల్జియం డిఫెండర్‌ డి బ్రుయినేను ఢీకొన్నాడు. దీంతో బెల్జియం జట్టుకు రిఫరీ పెనాల్టీ కిక్‌ కేటాయించగా, బెల్జియం మిడ్‌ఫీల్డర్‌ లుకాకు 69వ నిమిషంలో దానిని అద్భుతమైన గోల్‌గా మలిచాడు. మరో 6 నిముషాల్లో అంటే 75వ నిముషం వద్ద మరో గోల్ చేసిన లుకాకు.. బెల్జియంకు తిరుగులేని 3-0 ఆధిక్యతను సంపాదించి పెట్టాడు. ఈడెన్‌ హజార్డ్‌ అందించిన బంతిని చాకచక్యంగా అందుకున్న లుకాకో ఎంతో నైపుణ్యంతో పనామా గోల్‌కీపర్‌ను తప్పించి బంతిని గోల్‌పోస్టులోకి పంపిచాడు. ఈ గోల్స్‌తో బెల్జియం జట్టు పనామాపై తిరుగులేని 3-0 గోల్స్‌ ఆధిక్యతను సంపాదించింది.