Asianet News TeluguAsianet News Telugu

బకాయిల విడుదలకు టిఎన్ఎస్ఎఫ్ ఆందోళన

  • ఫీజు బకాయిలను విడుదల చేయాలి
  • 2090 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంఎల్ఏల నివాసాల ముట్టడికి హెచ్చరిక
TNSF Agitation

పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్)శనివారం మంత్రుల నివాసాలను ముట్టడించింది. గడచిన రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం రూ. 2090 కోట్లను విడుదల చేయాలని ఫెడరేషన్ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యార్ధుల సమస్యలను ప్రత్యేకించి ఫీజు బకాయిల విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నట్లు ఆరోపించారు.

  ఇదే విషయమై మధు ఏషియా నెట్ వర్క్ తో మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకం క్రింద విడుదల చేయాల్సిన నిధులను కళాశాలలకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ధ్వజమెత్తారు. తెలంగాణా వ్యప్తంగా 14.52 లక్షల మంది విద్యార్ధులకు ప్రభుత్వం ఫీజు బకాయిలు పడినట్లు చెప్పారు. 3200 కళాశాలల యాజమాన్యాలు కూడా ఇదే విషయమై ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్లు మధు తెలిపారు.

   సుమారు నాలుగు మాసాల క్రితం తమకు రావాల్సిన ఫీజు బకాయిల కోసం కళాశాలల యాజమాన్యాలు కూడా నిరవధిక సమ్మె చేసిన విషయాన్ని మధు గుర్తు చేసారు. ఇటు విద్యార్ధులు, అటు కళాశాలల యాజమాన్యాలు పెద్ద ఎత్తున పెట్టిన ఒత్తిడి కారణంగా పోయిన ఆగష్టులో వెయ్యి కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం మరో రూ. 2090 కోట్లను మాత్రం విడుదల చేయటంలేదన్నారు. విద్యార్ధులకు ఒక్క పైసా కూడా బకాయి లేకుండా తమ ప్రభుత్వం నిధులు మంజూకు చుస్తుందని సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు.

 ముఖ్యమంత్రి  మాటలకు చేతలకు అసలు సంబంధమే ఉండదని ధ్వజమెత్తారు. వారంలోగా మొత్తం ఫీజు బకాయిలను గనుక ప్రభుత్వం విడుదల చేయకపోతే సచివాలయం, ముఖ్యమంత్రి నివాసంతో పాటు మంత్రులు, ఎంఎల్ఏల నివాసాలన్నింటినీ ముట్టడించటం ఖాయమని హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios