Asianet News TeluguAsianet News Telugu

తెలుగు భాషపై పవన్ కల్యాణ్ మాట: అసలు విషయం ఇదీ...

తాను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నానని పవన్ కల్యాణ్ అంటున్నారు. బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్ అన్న మాట అది. ఆ మాటల లోతులను పరిశీలిస్తే సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు ముందుకు వస్తాయి.

English medium in Schools: Pawan Kalyan bats for Telugu
Author
Amaravathi, First Published Nov 13, 2019, 3:14 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న వాదనల్లో పలు వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ప్రవేశపెట్టినంత మాత్రాన తెలుగు భాష బతికిపోతుందా అనేది ప్రశ్న. 

మాతృభాష మృత భాషగా మారుతుందని అంటున్నారు. ఇందులో ఒక్క పదం కూడా తెలుగు లేదు. అవి సంస్కృత పదాల సమాసాలు. సంస్కృతం నుంచి తెలుగు జనించిందనే అపోహను భాషా శాస్త్ర పండితులు ఎప్పుడో కొట్టేశారు. మూల ద్రావిడం నుంచి ఉద్భవించిందని ధ్రువీకరించారు. అయితే, అనేక సంస్కృత పదాలు తెలుగు వచ్చి చేరాయి. దాన్నే ఆదానం అంటాం. ఆదానం ద్వారా అలా సంస్కృత పదాలు వచ్చి చేరాయి. 

సంస్కృత భారత అనువాదానికి శ్రీకారం చుట్టిన నన్నయ అనేక సంస్కృత పదాలను చిన్నపాటి మార్పులతో తెలుగులోకి తీసుకుని వచ్చారు. అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అలాగే, తదనంతరం కాలంలో అనేక ఆంగ్ల పదాలను తెలుగు జీర్ణం చేసుకుంది. బస్సులాంటి పదాలు అనేక పదాలు తెలుగే అన్నంతగా కలిసిపోయాయి. 

Also Read: పవన్ పై వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు: మిగతా అంతా....

పనిగట్టుకుని ఆంగ్ల పదాలకు తెలుగు పదాలను సృష్టించాలని చేస్తున్న ప్రయత్నాలు కాస్తా సంస్కృత సమాసభూయిష్టంగా మారి కొరకరాని కొయ్యలుగా మారిపోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు బాహ్య వలయాకార రహదారి, మొబైల్ కు చరవాణి వంటి పదాలు అటువంటివే. తెలుగు ఉర్దూ, పార్శీ భాషల ఆదనాలతో కూడా సంపద్వంతమైంది. ఇతర భాషా పదాలను అరువు తెచ్చుకోవడం ద్వారా ఏ భాష అయినా విస్తరిస్తుంది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న మాటల్లో వాస్తవం ఉంది. తాను తెలుగులోనే కదా చదువుకుందని ఆయన అన్నారు. అవును, తెలుగులో చదువుకున్నవాళ్లు పైస్థాయిల్లో ఉన్నవారు చాలా మందే ఉన్నారు. బహుశా, కేసీఆర్ కూడా తెలుగు మాధ్యమంలోనే చదువుకుని ఉంటారు. కానీ, తెలుగుతో సమానంగా ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలరు. ఆంధ్ర ప్రాంతంలో హిందీ మాట్లాడడం అనేది చాలా అరుదు. అటువంటి జాతీయ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించి, ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు హిందీ కూడా మాట్లాడగలుగుతున్నారు. 

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భాషా సరిహద్దులను అధిగమించి జాతీయ రాజకీయాల్లో పలుమార్లు చక్రం తిప్పారు. బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంగ్ల మాధ్యమంలో చదివి ఉంటారు. కానీ, తెలుగు అనర్గళంగా మాట్లాడి ఆంధ్రప్రజలను మెప్పించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టగలిగారు.

Also Read: 'పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు ఏ స్కూళ్లో చదువుతున్నారు'

అనివార్యమైనప్పుడు, ఇతర భాషల్లో సమాచార వినిమయం చేయాల్సి వచ్చినప్పుడు వాటిని నేర్చుకోవడం, అలవాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ, దానికి తగిన సమయం అవసరం, అభ్యాసం అవసరం. ఇంగ్లీష్ ప్రధానమైన, కీలకమైన సమాచార మాధ్యమ భాషగా ముందుకు వచ్చింది. ప్రైవేటీకరణ, కార్పోరేట్ వ్యవస్థ విస్తరణ నేపథ్యంలో తెలుగు మాధ్యమంగా పనిచేసే సంస్థల్లో కూడా పైఅధికారులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ప్రాజెక్టులను ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, ప్రతి చోటా ఆంగ్ల భాష నిత్యావసరంగా మారింది. 

అయితే, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తర్వాత వైద్య, ఇంజనీరింగు కోర్సుల్లో చేరిన తర్వాత విద్యార్థులు పడే యాతన వర్ణనాతీతంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులు ఇంజనీరింగులోనో, మెడిసిన్ లోనో చేరిన తర్వాత వెనకబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలుగు నుంచి ఒక్కసారిగా ఇంగ్లీషులోకి మారే సరికి విషయం అర్థంకాక, అయోమయానికి గురై చిక్కులను ఎదుర్కుంటున్నారు.

పైగా, తెలుగులోకి అనువాదం చేసిన సాంకేతిక పదాలపై పట్టు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యలోకి వెళ్లిన తర్వాత వాటి ఆంగ్ల పదాలను గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది. పైగా, ఇంగ్లీష్ సాంకేతిక పదాలకు మనం చేసే అనువాదాలు సంస్కృతి భూయిష్టంగా ఉంటున్నాయి. ఒక రకంగా అవి ఇంగ్లీష్ సాంకేతిక పదాల కన్నా గొట్టుగా ఉంటున్నాయి. 

ఉదాహరణకు... ట్రాయాంగులర్ అనే పదానికి త్రికోణం, ట్రిగ్నామిట్రి అంటే త్రికోణమితి, ఇన్ ఫ్లేషన్ కు ద్రవ్యోల్బణం, ఫొటో సింథసిస్ అంటే కిరణ జన్య సంయోగ క్రియ ఇలా చెబుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలుగు అనువాదాల్లో ఏదైనా సూటిగా అర్థమయ్యే పదం గానీ, నిత్య జీవితంలో పరిచయం అయిన పదం గానీ ఉందా అనేది ప్రశ్న. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి అంతా అంగ్ల భాషలోనే జరిగింది. భారతీయ భాషల్లో శాస్త్ర, సాంకేతికాభివృద్ధి ఎంత మేరకు జరిగిందనేది ఆలోచించాల్సిన విషయం. అంతరిక్ష పరిశోధనల్లో మనం ముందుకు సాగుతున్నాం. దానికి సంబంధించిన విజ్ఞానం ఏ భాషలో ఉంటుందనేది కూడా ఆలోచించాల్సిన విషయం.

Also Read: బడుల్లో ఇంగ్లీష్ మీడియం: వైఎస్ జగన్ నిర్ణయంలోని ఆంతర్యం ఇదే

అదంతా ఒక ఎత్తయితే, తెలుగు భాషలోనే కదా తాను చదివింది అంటున్న పవన్ కల్యాణ్, ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించి ఉన్నత స్థానాల్లో ఉన్నవారి పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారనేది కీలకమైన ప్రశ్న. ఇక్కడే జగన్ వారితో విభేదిస్తున్నారు. సంపన్నులు, ఉన్నత స్థాయి పిల్లలకే ఇంగ్లీష్ మాధ్యమం అందుబాటులో ఉండడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నిస్తున్నారు. 

విద్యావ్యవస్థ పెద్ద యెత్తున ప్రైవేటీకరణ జరిగిన నేపథ్యంలో కార్పోరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఇంగ్లీష్ మాధ్యమంలోనే పాఠాలు బోధిస్తున్నాయి. వాటి వైపే ప్రజలంతా చూస్తున్నారు. సంపన్నులు వాటిలో తమ పిల్లలను చేర్చగలుగుతున్నారు. మరి, పేదల సంగతేమిటి, పేదలకు కూడా తమ పిల్లలు అటువంటి పాఠశాలల్లో చదివితే బాగుండుననే ఆశలేదని చెప్పగలమా?

విద్యావ్యవస్థను సమూలంగా మార్చేసి అన్ని విద్యా సంస్థలు తెలుగు మాధ్యమంలోనే బోధనలు చేయాలనే నిబంధనను ప్రభుత్వం తెచ్చే పరిస్థితి ఉందా, అంటే లేదనే చెప్పాలి. అలా లేనప్పుడు ఆ విద్యాసంస్థల్లో ఉన్న విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడితే వారు కూడా ఇంగ్లీష్ విద్యా సంస్థల్లో చదువుకునేవారితో పోటీ పడగలరు. 

అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంగ్లీష్ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నవారంతా తమ పిల్లలను తెలుగు మీడియం పాఠశాలల్లో చేర్చగలరా? అలా చేర్చగలిగినప్పుడు మాత్రమే జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వారికి న్యాయమైన హక్కు ఉంటుంది. జగన్ అంటున్నది ఇదే. దీన్ని పవన్ కల్యాణ్ సరైన దృక్కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

పవన్ కల్యాణ్ మాత్రమే కాదు, ఇంగ్లీష్ మాధ్యమాన్ని వ్యతిరేకించేవారంతా ఒక ఉద్యమంలాగా తమ పిల్లలను తెలుగు మీడియం పాఠశాలల్లోనే చేరుస్తామని ప్రతిజ్ఞ చేసి, ఒక ఉద్యమం చేపట్టినప్పుడు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios