పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోగానే కొన్ని వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. తెలుగులోనే పాఠాలు ఉండాలని వాదిస్తున్నాయి. అలా వాదిస్తున్న వర్గాలేవి, ఎందుకు వాదిస్తున్నాయని ప్రస్తుతం మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అదే సమయంలో తెలుగు మీడియంలో చదవడం వల్ల అదనపు ప్రయోజనం ఏమిటి అనేది ప్రధానమైన ప్రశ్న.

read more  జగన్ ప్రభుత్వ నిర్ణయం... తెలుగు జాతికే పొంచివున్న ప్రమాదం...: టిడిపి ఎమ్మెల్సీ

జీవితాచరణలకు, ఆదర్శాలకు మధ్య వైరుధ్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా అనేది ఇంకో ప్రశ్న. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగు మరణిస్తుందనే ఒక ఆవేదన తప్ప అందులో ఏ విధమైన అదనపు విలువ లేదు. మాతృభాషను అభిమానించాల్సిందే, ఆదరించాల్సిందే. ఇందులో మరో అభిప్రాయం ఉండడానికి వీలు లేదు. ఇళ్లలో తెలుగు మాట్లాడుతూ, సమాజంలో హిందీ లేదా ఉర్దూ, ఇంగ్లీష్ అవసరాలు ఏర్పడిన విషయం వాస్తవం కాదా అనేది ఆలోచించుకోవాలి.

ALSO READ;ఏపి సీఎం జగన్ ఓ పిచ్చోడు...అందుకు నిదర్శనాలివే...: బుద్దా వెంకన్న

ఉపాధి, విద్యకు అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కోసం కొత్త విద్యలను నేర్చుకోవడానికి పిల్లలను ప్రోత్సహిస్తున్నాం, సాఫ్ట్ వేర్ లో ఎప్పటికప్పుడు వస్తున్న అభివృద్దికి అనుగుణంగా తమను తాము మలుచుకోవడానికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. ఒక్క సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు, అందరూ తమ తమ వృత్తుల్లో వస్తున్ననూతన పరిణామాలను అందుకోవాల్సిన అవసరం జీవనోపాధి కోసం, ఉద్యోగాల్లో పదోన్నతి కోసం నేర్చుకోవాల్సి వస్తోంది. 

ఉపాధికీ విద్యకు మధ్య అవినాభావం సంబంధం ఉన్న భాష మాత్రమే జీవించి విస్తరిస్తుందని తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎన్ గోపి ఒకానొక సందర్భంలో రాశారు. ఆయన ఏ పరభాషనో చదివినవారు కారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ పొంది, తెలుగు సాహిత్యాన్ని విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనలు చేసినవారు ఆయనకు తెలుగు భాషపై మమకారం లేదని అనుకోవడానికి లేదు. అందువల్ల ఆయన ఏ దృష్టికోణంతో ఆ విషయాన్ని చెప్పారో తెలుగు మీడియాన్ని ఎత్తేస్తే గగ్గోలు పెట్టేవారు ఓసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. 

ప్రముఖ సామాజిక తత్వవేత్త, వై ఐ యామ్ నాట్ ఏ హిందూ గ్రంథకర్త కంచె ఐలయ్య కూడా ఇంగ్లీష్ బోధన ఉండాలని వాదిస్తున్నారు. ఎన్. గోపి వాదనలోని సామంజస్యాన్ని అంగీకరిస్తూనే కంచె ఐలయ్య కాస్తా ముందుకు వెళ్లి మాట్లాడుతున్నారు. దళిత, బహుజన వర్గాలకు ఇంగ్లీష్ మీడియంలో చదవడం అవసరమని ఆయన వాదిస్తున్నారు. ఐలయ్య మాటల్లో కూడా వాస్తవం లేదని చెప్పలేం. ఎందుకంటే, ప్రైవేట్ రంగం విస్తరిస్తూ కార్పోరేట్ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రస్తుత తరుణంలో వాటిలో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ లో చదవక తప్పదని ఆయన భావన.

భాషా బోధన విషయంలో తెలుగు మీడియం కోసం పట్టుబడుతున్నవారు ఎక్కువగా అగ్రవర్ణాలకు చెందినవారనే విషయం చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఇంగ్లీష్ చదువుకున్నవారు బ్రిటిషాంధ్రలోని దళిత వర్గాలు కూడా తెలంగాణలో నిజాం ప్రభుత్వ హయాంలో ఉర్దూ మీడియంకు పరిమితమైన నిజామాంధ్ర అగ్రవర్ణాల కన్నా సామాజిక చలనశీలతలో ముందున్నారనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. హైదరాబాదు రాజ్యంలోని అగ్రవర్ణాలవారు ఇంగ్లీష్ లో కూడా చదువుకుని ఉన్నత స్థాయిల్లో ఉండడం అసత్యమేమీ కాదు. దీనికి పలు ఉదాహరణలు ఇవ్వవచ్చు.

అగ్రవర్ణాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్ లో సంపాదించిన ప్రావీణ్యం కారణంగా కార్పోరేట్ సంస్థల్లో, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ముందంజలో ఉన్నారు. వారి పిల్లలు తెలుగు మీడియంలో చదువుతారా, తెలుగు బోధించే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారా అనేది ప్రధానమైన ప్రశ్న. ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే స్తోమత లేని వర్గాలు మాత్రమే ఇంకా ప్రభుత్వ పాఠశాలలకు అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ పిల్లలు తమ కన్నా సోకాల్డ్ అభివృద్ధిని అందుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం అత్యవసరంగా మారింది.

తెలుగు మీడియంలో చదువుకుని కార్పోరేట్ సంస్థల్లో పనిచేస్తున్న చాలా మంది కేవలం ఇంగ్లీష్ మాధ్యమంలో సమాచార వినిమయాన్ని సరిగా చేయలేకపోవడంతో ప్రతిభ ఉన్నప్పటికీ పైమెట్టు ఎక్కలేకపోతున్నారనే విషయం పలువురికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అటువంటి స్థితిలో తెలుగు మీడియం అనేదాన్ని కొద్ది మందికి, అదీ ఆర్థిక, సామాజిక స్తోమత లేనివారికి పరిమితం చేయాలనుకోవడంలో స్వార్థి చింతన ఛాయలు ఉన్నాయా, లేదా అనే ఆలోచించాల్సి ఉంటుంది. 

ఇకపోతే, గృహిణులను, కేవలం తెలుగు మాత్రమే వచ్చినవారిని ఆకట్టుకోవడానికి రూపొందిస్తున్న పలు టీవీ కార్యక్రమాలు, షోలకు సంబంధించిన ప్రణాళికలు ఏ భాషలో యజమానుల ముందు పెట్టాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఆలోచించాల్సి ఉంటుంంది. తెలుగులో కార్యక్రమాల ప్రదర్శన జరుగుతున్నప్పటికీ దానికి వెనక ప్రణాళిక, దాని ఆచరణ అంతా ఇంగ్లీషులోనే నడుస్తుంది. కార్పోరేట్ సంస్థలు, విదేశీ పెట్టుబడిదారీ సంస్థలు గ్రామాల్లోకి కూడా చొచ్చుకుని వస్తున్న ప్రస్తుత తరుణంలో గౌరవనీయమైన ఉపాధిని పొందడానికి సహకరించేది ఇంగ్లీష్ భాష మాత్రమే. కొన్నిసార్లు హిందీ భాష కూడా.

పాఠశాలల్లో తెలుగులో మాత్రమే విద్యాబోధన ఉండాలని వాదించేవారు సామాజిక పరిణామాలను, సామాజిక ఆరోహణావరోహణాలను పట్టించుకోవాల్సి ఉంటుంది. భాష ముఖ్యమా, సంస్కృతి ముఖ్యమా, వ్యక్తిత్వం ముఖ్యమా అని ఆలోచించినప్పుడు సంస్కృతికి, వ్యక్తిత్వానికి పెద్ద పీట వెయాల్సి ఉంటుంది.

వివిధ స్థాయిల్లో తెలుగులో సామాజిక, సాంస్కృతికాంశాలను, తెలుగు చారిత్రను, తెలుగు సాహిత్యాన్ని బోధించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వైద్య, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్యలను అభ్యసించే విద్యార్థులకు ఆ అంశాలను అనివార్యంగా బోధించే ఏర్పాటు చేయాలి. అప్పుడు మనిషిలో వ్యక్తిత్వం వికసించి, సామాజిక జీవిగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. లేదంటే, ప్రస్తుత స్వార్థ చింతన, ధనవ్యామోహం పెరిగిపోయి సమాజానికి చీడ పడుతుంది ఆ చీడ ఇప్పటికే చాలా పట్టింది. ప్రతి రోజూ జరుగుతున్న నేరవార్తలను చూస్తే మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. మానవీయత లోపించి రాక్షసుడు నిద్ర లేస్తున్న సమాజాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తస్మాత్, జాగ్రత్త!