ముంబై: భారత్ ఆస్ట్రేలియాతో ముంబై వాంఖడే స్టేడియం లో మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ కి స్వర్గధామమైన ఈ పిచ్ పై భారత్ ఒకింత డీప్ బ్యాటింగ్ లైన్ అప్ తోనే దిగినట్టు మనకనిపించినా... రెగ్యులర్ ప్రాబ్లం లోయర్ మిడిల్ ఆర్డర్ సమస్యకు సరిఅయిన పరిష్కారాన్ని చూపెట్టలేకపోయింది. 

టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, ధావన్, రాహుల్, కోహ్లీ లతో బలంగా ఉంది. శ్రేయాస్ అయ్యర్ రూపంలో ఒక సాలిడ్ బ్యాట్స్ మెన్ కూడా ఉన్నదనిపించింది. ఆ తరువాత ఫైర్ పవర్ అన్నట్టుగా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ ఉన్నాడనిపించింది. 

రవీంద్ర జడేజాను కూడా తీసుకున్నారు. మొన్నటి బ్యాటింగ్ హీరోయిక్స్ వల్ల శార్దూల ఠాకూర్ ని కూడా తీసుకున్నారు. ఇదంతా మ్యాచుకు ముందు. 

మ్యాచ్ ప్రారంభమయింది. ముంబై వాంఖడేలో బలమైన రెకార్డున్న రోహిత్ శర్మ పది పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ మీద టీం ఇండియా భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అవన్నీ ఆవిరయ్యాయి.

Also read; ఓపెనర్స్ బిగ్ ఫైట్: రాహుల్, ధావన్ లలో నిలిచేదెవరు...?

ఆ తరువాత వచ్చిన రాహుల్ తో కలిసి ధావన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ తరుణంలోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత వెంటవెంటనే రాహుల్, ధావన్, కెప్టెన్ కోహ్లీ అవుట్ అవ్వడంతో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ పై భారమంతా పడింది. 

ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఒక వేళ గనుక అందరూ టాప్ ఆర్డర్ విఫలమైతే మిడిల్ ఆర్డర్ లో పరిస్థితి ఏమిటనేది భారత్ ను ఎప్పటి నుండో వేధిస్తున్న సమస్య. చిన్న టీంల పైన మిడిల్ ఆర్డర్ ప్రభావం చూపడం వేరు.. ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీంలపైనా ప్రభావం చూపెట్టి టీం ని గెలిపించడం వేరు. 

రిషబ్ పంత్ 28 పరుగులు చేసినప్పటికీ... అతడు ప్రెషర్ తీసుకొని ఆడగల నైపుణ్యం ఉన్న ఆటగాడు కాదు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక వర్ధమాన క్రికెటర్. బలమైన పునాది వేసిన తర్వాత వెళ్లి మెరుపులు మెరిపించమంటే మెరిపించగల 6వ నెంబర్ బ్యాట్స్ మెన్ తప్ప నమ్మదగ్గ లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కాదు. ధోని లెవెల్ ఫినిషర్ స్థాయికి పంత్ ఇంకా చేరుకోలేదు. 

ఇక మరో అంశం ఆస్ట్రేలియా బౌలింగ్ లైన్ అప్. ఆస్ట్రేలియా పేస్ త్రయం గురించి సాధారణ క్రికెట్ అభిమానులే మాట్లాడుకుంటుంటే... టీం ఇండియా మానేజ్మెంట్ కి ఈ విషయం తెలియదంటారా? ప్రస్తుతానికి టీం లో రాహుల్ వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. ఒక వేళా రాహుల్ ని గనుక కీపింగ్ కి ఉపయోగించుకుంటే... ఖచ్చితంగా పంత్ స్థానంలో మనీష్ పాండే ను తీసుకునే అవకాశం ఉండేది. 

మొన్నటి ముస్తాక్ అలీ టోర్నమెంటులో మనీష్ పాండే ఆటతీరు అద్భుతం. అతడు ఇప్పుడొక పరిణితి చెందిన క్రికెటర్ గా ఎదుగుతున్నాడు. గేమ్స్ ని ఫినిష్ చేయగలుగుతున్నారు. మొన్నటి వెస్టిండీస్-ఏ తో జరిగిన శ్రీయసులో మనీష్ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొన్నటి టి 20 సిరీస్ లో కూడా మనీష్ పాండే అద్భుత ప్రదర్శనే ఇచ్చాడు.

Also read: బ్యాటింగ్ చేస్తూ విరాట్ కోహ్లీ దేని గురించి ఆలోచిస్తాడో తెలుసా..? 

ఇక శ్రేయాస్ అయ్యర్ విషయానికి వస్తే... టి 20ల్లో అంతబాగా ఆడలేకపోయినా వన్డేల్లో అతడి ఆటను తీసిపారేయలేము. ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించేంత పరిణితి ఉన్న క్రికెటర్. అందులో అనుమానం లేదు. కాకపోతే ప్రెషర్ ని తీసుకోగలిగి, ఎదురొడ్డి నిలబడగల్గాలి. 

ఇంతకుముందంటే జట్టులో లోయర్ ఆర్డర్ కి వచ్చేసరికి ధోని ఉండేవాడు. అతడు ప్రెషర్ అనే మాటే తెలీకుండా కూల్ గా ఆడుతూ అవతలివైపు ఉన్నవారిని ఎలా ఆడాలో కూడా సూచిస్తుంటాడు. ఇప్పుడు లోయర్ మిడిల్ ఆర్డర్ లో అందరూ కూడా యువకులే ఉండడం వల్ల ఆ అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. 

ఇప్పుడు పంత్ ను తీసుకోవడం ఇక్కడ తప్పు బట్టే విషయం కాదు, కానీ జట్టు అవసరాల రిత్యా అనుగుణంగా మలుచుకుంటూ ఆడగలిగే ప్లేయర్స్ అవసరం ఎంతైనా ఉంది. మనీష్ పాండే గనుక ఉంది ఉంటె.. అతడి సుదీర్ఘ అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడేది. అతడు క్రీజులో కుదురుకుని అప్పుడు తన విన్యాసాలను మొదలుపెట్టగలడు. 

నేటి మ్యాచులో భారత్ తక్కువ స్కోర్ కొట్టిందన్న బాధ కన్నా... పూర్తి 50 ఓవెన్లను ఆడలేకపోయిందన్న బాధనే ఎక్కువగా కలిచివేస్తుంది. టీం లో అనుభవలేమి ఉన్నప్పటికీ కూడా టాప్ ఆర్డర్ విఫలమైతే ఇక అంతే సంగతులు అని మరోసారి చర్చించుకునే పరిస్థితులు రావడం నిజంగా బాధాకరం. 

Also read: "కంగారె"త్తిన ఇండియా: చేజేతులా వికెట్లు పారేసుకున్న రోహిత్, రాహుల్

చిన్నప్పుడు భారత టీం ను సైకిల్ స్టాండ్ లోని సైకిళ్లతో పోల్చేవారు. ఒక్క టెండూల్కర్ వికెట్ పడితే ఇక అంతే సంగతులు... సైకిల్ స్టాండ్ లోని ఒక్క సైకిల్ తోసేస్తే అన్ని ఎలా పడిపోతాయి...అలా భారత జట్టు అమాంతం కుప్పకూలుతుంది అని అప్పట్లో టాక్. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు పునరావృతమవుతుండడం ఒకింత విస్మయానికి గురిచేస్తుంది. 

గత సంవత్సర ఆరంభంలో అండర్ డాగ్ గా భారత్ లో పర్యటనాకు వచ్చిన ఆస్ట్రేలియా అనూహ్యంగా వన్డే, టి 20 సిరీస్ లను ఎగరేసుకుపోయింది. కోహ్లీ నాయకత్వానికి స్వదేశంలో సిరీస్ ఓడిపోవడం ఒక మాయని మచ్చ.

ఈ సారి ఏకంగా ఆస్ట్రేలియా వార్నర్, స్మిత్ లతో కలిసి సమవుజ్జిగా భారత్ లో పర్యటిస్తున్న వేళ ఇంకా పాత చేదు జ్ఞాపకాలు గుర్తుకు తెచుకోవాలిసి రావడం మాత్రం అంత మంచి సంకేతం కాదు.