ఆంధ్రప్రదేశ్లో లో నిన్నటి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ట్రాన్స్ఫర్ రాజకీయ దుమారానికి దారితీసింది. షోకాజ్ నోటీసు అందుకున్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక సీఎం కార్యాలయ అధికారి ఏకంగా చీఫ్ సెక్రటరీనే  ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఉత్తర్వులివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక రకంగా పూర్తి అధికార వ్యవస్థ పైన, అధికారుల పైన నెగిటివ్ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. 

వివరాల్లోకి వెళితే(దీంట్లో రాజకీయ కోణం ఏముంది అనేది పక్కన పెడితే), సీఎస్ హోదాలో ఎల్ వి సుబ్రహ్మణ్యం సీఎంఓ కార్యాలయ అధికారి అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ కి షోకాజ్ నోటీసు జారీ చేశాడు. తర్వాత రాజకీయ పరిణామాలు ఏంటి అనేది పక్కన పెడితే, ప్రవీణ్ ప్రకాష్ ఏకంగా  షోకాజ్ నోటీసు జారీ చేసిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను అప్రాధాన్యమైన మానవ వనరుల శాఖకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశాడు. 

Also read: జగన్ సీరియస్: సిఎస్ ఎల్వీ బదిలీ వెనక అసలు ట్విస్ట్

ఈ షాకింగ్ బదిలీ వల్ల మిగిలిన అధికారులలో ఒకింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన కార్యదర్శినే ఇంత అలవోకగా బదిలీ చేయగలిగితే, మా పరిస్థితి ఏంటి? సాధారణ అధికారులమైన మమ్మల్ని ఎలా పడితే అలా ట్రాన్స్ఫర్ కు గురి చేస్తారు కదా, అనే అనుమానం మాత్రం వారిలో కచ్చితంగా మొదలవుతుంది. 

ఇదే తరహా బదిలీలు గనుక కొనసాగితే అధికారులు పూర్తి స్థాయిలో తమ శక్తిసామర్థ్యాల మేర ధైర్యంగా పని చేయగలుగుతారా? ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాము అని భయపడతూ స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారా? అనే అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉద్భవిస్తున్నాయి. 

దీనిలో ఉన్న మరో కోణం ఏంటంటే, చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి. దాంతోపాటు ఇతను రాష్ట్ర ప్రభుత్వం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్. మరో అంశం ఏంటంటే, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ బోర్డుకి చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను నియమించాలన్నా, ఆ ఉత్తర్వులను జారీ చేయాలన్నా అది చీఫ్ సెక్రటరీ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. 

సీనియర్ అధికారిని జూనియర్ అయినటువంటి ఒక సీఎం కార్యాలయ అధికారి ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పుడు ఇక్కడ అసలు సమస్యగా మారింది. సాధారణంగా చీఫ్ సెక్రటరీ రాష్ట్రంలో ఉన్న అందరు ఐఏఎస్ అధికారులకు ఒక రకంగా బాస్ అని చెప్పవచ్చు. పరిపాలన విభాగంలో కూడా హెడ్. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ కార్యాలయం మిగిలిన అన్ని కార్యాలయాల కన్నా పెద్దది. 

Also read: హిందుత్వానికి ప్రాధాన్యత ఇవ్వడమే సీఎస్ బదిలీకి కారణమా...?: ఐవైఆర్

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఇంకో పవర్ సెంటర్ గా తయారయ్యిందా అనే అనుమానం మాత్రం కలుగకమానదు. సిఎంఓ ఒక సూపర్ క్యాబినెట్ మాదిరి వ్యవహరిస్తుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే మనకు దర్శనమిస్తాయి. 

సిఎంఓ లో సమర్థవంతమైన అధికారులు ఉండరని కాదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎందరో సమర్థులైన అధికారులు ఉండొచ్చు. కాకపోతే వారికి ప్రధాన కార్యదర్శికి మధ్య సమన్వయము ముఖ్యం. అది లోపిస్తేనే ప్రమాదం. ఇదే ఇక్కడ అసలు సమస్య. 

ఇలా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చీఫ్ సెక్రటరీ కార్యాలయం కన్నా ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి తోని సన్నిహితంగా ఉండటం వల్ల చాలా పవర్ ఫుల్ గా మారినట్టు మనకు అర్థమవుతుంది. ఇదొక్కటే కాకుండా, ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. అదేమిటంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడడం. 

ఎందుకీ మాట చెప్పవలసి వస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో అధికారుల హయరార్కీ చాలా ఎక్కువయిపోయి అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. ఉదాహరణకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఒక ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉంటాడు. అతనిప్పుడు ఎవరి మాట విని పని చేయాలి? డైరెక్టుగా అతనిపైన చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఇతనితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆర్థికశాఖను పర్యవేక్షించే ఇంకొక సెక్రటరీ ఉంటాడు. ఇతనితో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఉండనే ఉన్నాడు. వీళ్ళందరికీ తోడుగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సలహాదారులు కూడా తోడయ్యారు. 

Also read: టీటీడీలోని అన్య మతస్తులు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి: సీఎస్

ఈ నేపథ్యంలో సదరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరి ఆదేశాలకు లోబడి పని చేయాలి? ముఖ్యమంత్రి కార్యాలయం మరో సమాంతర వ్యవహారం నడపక ముందు కేవలం చీఫ్ సెక్రటరీ మాత్రమే బాస్ గా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం ఇలాంటి హయరార్కీకల్ గందరగోళ పరిస్థితులు ఏర్పడడం వల్ల అధికారుల్లో కన్ఫ్యూషన్ మొదలై పాలన గాడి తప్పే ఆస్కారం ఉంది.  

ఎల్వి సుబ్రహ్మణ్యం విషయానికి వచ్చేసరికి ఒక చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. దానిపైన ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ, ఇలా ఆకస్మికమైన అనూహ్య రీతిలో ట్రాన్స్ఫర్ చేయడం మాత్రం సుపరి పాలనకు అంత మంచి పరిణామం కాదు. ఇలాంటి విచక్షణా రహితమైన ట్రాన్స్ఫర్ల వల్ల రేప్పొద్దున మరో అధికారి సైతం ఇలానే బదిలీ అయ్యే ప్రమాదం లేకపోలేదు. 

ఇక ఇప్పుడు రాజకీయ పరిణామాల విషయానికి వస్తే, చంద్రబాబు ఎల్వి సుబ్రహ్మణ్యం కు బాసటగా నిలిచాడు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో టిడిపి హయాంలో ఎల్ వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా నియమిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ మనిషని ఒక అధికారికి రాజకీయ రంగులు ఆపాదించే ప్రయత్నం చేశాడు. 

Also read: కోరి తెచ్చుకున్న వ్యక్తి బదిలీయా.. ఏదో జరిగింది: ఎల్వీ ట్రాన్స్‌ఫర్‌పై పవన్ వ్యాఖ్యలు

అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎల్ వి సుబ్రహ్మణ్యం తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతుంటే ఒకింత అధికార పక్షానికి ప్రతి విమర్శ చేయడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది.  రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇలాంటి అధికారులతో మర్యాదపూర్వకంగా మెదలడం ఎంతైనా చెప్పదగిన సూచన. పరిపాలన సక్రమంగా జరగాలంటే అధికారులు, మంత్రుల మధ్య సయోధ్య తప్పనిసరి. దీన్ని గుర్తెరిగి నడుచుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది.  

ఇక నిన్నటి సుజనా చౌదరి మాటలు పరిశీలిస్తే, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తూ ఉందంటూ ఒక వ్యాఖ్య చేసాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఎప్పటినుంచో కన్నేసిన బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలియవస్తుంది. 

ఎల్వి సుబ్రహ్మణ్యం పదవీకాలం ఇంకో నాలుగు నెలల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్ర సర్వీసులకు తీసుకొని వెళ్లి అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం ద్వారా జగన్ సర్కార్ పై తుపాకీ ఎక్కు పెట్టొచ్చని కేంద్రం భావిస్తోంది.  

అంతేకాకుండా జగన్ లోగుట్టు ఎంతోకొంత మాత్రం ఎల్ వి సుబ్రహ్మణ్యంకు ఖచ్చితంగా తెలుసు. ప్రస్తుతం జగన్ సర్కారుకు ప్రజల్లో మంచి పాపులారిటీ ఉంది. అసంతృప్తి ఇంకా మొదలవ్వలేదు కాబట్టి నేరుగా వారికి అవకాశం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఎల్వి సుబ్రమణ్యంను వాడుకోవడం ద్వారా, జగన్ పై కేంద్రం పోరు ప్రకటించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరింత పెరిగే ఆస్కారం మాత్రం స్పష్టంగా కనపడుతుంది.