తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు కవిత. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ నేతలు రాజీనామాలు చేసి ఎన్నికలకు పోయిన ప్రతిసారి అక్కడ ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసేది. 

అప్పట్లో తెలంగాణ ఉద్యమ నినాదం మహబూబ్ నగర్ జిల్లాలో బలంగా లేదని అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు అంటే...తెలంగాణ ఆకాంక్ష యావత్ తెలంగాణ అంతా ఉందని నిరూపించడానికి కెసిఆర్ అక్కడ పోటీకి దిగారు.

అప్పట్లో అది సాహసమే చెప్పాలి. అక్కడ గనుక కేసీఆర్ ఓటమి చెంది ఉంటే, తెలంగాణ ఉద్యమానికి అది పెద్ద ఎదురుదెబ్బ అయి ఉండేది. ఆ ఎన్నికలో కవిత అన్నీ తానై వ్యవహరించి అక్కడ తండ్రి గెలుపులో కీలక పాత్ర పోషించింది. 

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మకు పునరుజీవనం పోయడంలో కవిత పాత్ర కీలకం. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేయడంద్వారా తెలంగాణ అస్తిత్వ ప్రతీకలన్నిటికి కవిత ఊపిరిని ఊదారు అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

తెలంగాణ నుంచి టెక్సాస్ వరకు తెలంగాణవారు ఎక్కడుంటే అక్కడ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణను ప్రోత్సహిస్తూ, కుదిరితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఈ బతుకమ్మ పండుగకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు.

తెలంగాణ ఏర్పడ్ద తరువాత ట్యాంక్ బండ్ పై భారీస్థాయిలో వేడుకలను నిర్వహించడం... తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. 

కనిపించని కవిత...

అలంటి కవిత ఇప్పుడు పెద్దగా కనపడడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి కవిత బహిరంగ వేదికలపై కనపడడం లేదు. బతుకమ్మ పండుగ వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా బయటకు రాలేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భారీ విజయం తరువాత ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు తప్ప బహిరంగంగా మాత్రం దర్శనమివ్వలేదు. 

2014 పార్లమెంటు ఎన్నికల్లో అత్తగారిళ్లయిన నిజామాబాదు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆమె ఒక్కరు మాత్రమే గెలవడం కాదు ఆ జిల్లాను క్లీన్ స్వీప్ చేసి కెసిఆర్ కి గిఫ్ట్ గా అందించారు కవిత.  

కానీ రెండో దఫాలో మాత్రం తన అత్తింట కవిత ఓడిపోయారు. అప్పటి నుంచి కవిత కోలుకున్నట్టు కనపడడం లేదు. బతుకమ్మ వేడుకలకు కూడా ఆమె దూరంగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కవిత ఓటమి చెందడం ఒకింత తెరాస వర్గాలందరిని షాక్ కు గురి చేసాయి. 

Also read: కవిత భవిష్యత్తుపై కేసీఆర్ ప్లాన్ ఇదీ: శరద్ పవార్ ఫార్ములా

పార్టీ వర్గాలకే అంత షాక్ కు గురి చేస్తే కవితను ఎంతలా షాక్ కి గురి చేసి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకోసమే ఆమె బహిరంగ వేదికలపైన ఎక్కడా కనబడడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కవిత ఓటమి వల్ల చాలానే ఫీల్ అయ్యాడట. ఎంతకాదన్నా గారాల కూతురు ఓడిపోవటం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా. 

ఇక మరోసారి ఎన్నికల్లో గెలవాలంటే... మరో నాలుగున్నర సంవత్సరాలు రాజకీయంగా పనిలేకుండా కూర్చోవాల్సి ఉంటుంది.  రాజకీయంగా చాలా క్రియాశీలకంగా వ్యవహరించే కవితకు ఇది చాలా కష్టమైనా పని.  ఇలా ఖాళీగా ఉండడం ఆమె రాజకీయ భవిష్యత్తుకు కూడా అంత మంచిది కాదని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.  

ఇకపోతే... కెసిఆర్ కొడుకు కేటీఆర్ రాజకీయంగా ఎదుగుతున్నారు. రేపో మాపో తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నాడనేది సుస్పష్టం. కూతురు మాత్రం ఈ టైం లో ఖాళీగా కూర్చోవడం కెసిఆర్ కు అంతగా నచ్చట్లేదట. 

నో దొడ్డి దారి....

ఈ నేపథ్యంలోనే  అందుకే సీఎం కేసీఆర్ కవితను రాజ్యసభకు పంపడానికి నామినేట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది.  అయితే రాజ్యసభకు వెళ్లడానికి కవిత మాత్రం అంత ఆసక్తి చూపించడం లేదన్నది వినిపిస్తున్న వాదన. 

ప్రజాక్షేత్రంలో గెలిచి వెళితేనే ఎంపీగా తనకు స్థారకత అని కవిత భావిస్తున్నారట. ఇలా ఏదో రాజకీయ పునరాశ్రయంగా నాన్న ఇచ్చిన  నామినేటెడ్ రాజ్యసభ పదవి ద్వారా పార్లమెంటుకు వెళ్లడం కవితకు ససేమిరా ఇష్టం లేదట. 

రాజ్యసభ సీటు ఉత్సవవిగ్రహం లాంటిదని ఆమె తన సన్నిహిత వర్గాల మధ్య అన్నట్టు సమాచారం. ఇలాంటి బ్యాక్ డోర్ ఎంట్రీలను కూడా కవిత మెచ్చడం లేదంట. ఓటమినే అంత త్వరగా కవిత జీర్ణం చేసుకోలేకపోతున్నా తరుణంలో ఇలా ఓడిపోయి దొడ్డి దారిన ఎంపీ అయింది అనే మాటను కవిత అంత ఈజీగా తీసుకోలేకపోవచ్చు. అలా కాకున్నప్పటికీ... ప్రతిపక్షాలు దీన్నే పదే పదే ప్రశ్నిస్తూ కవితను టార్గెట్ చేసే ఆస్కారం ఎక్కువ.  

షార్ట్ టర్మ్ గోల్...

ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ ని, మరో లాంగ్ టర్మ్ ప్లాన్ ని ఆలోచించారట. కేటీఆర్ సీఎం అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కవితకు ఇవ్వడానికి కేసీఆర్  యోచిస్తున్నారట. కవిత అయితే కేటీఆర్ కి అన్నివిధాలుగా సహాయకారిణిగా కూడా ఉంటుందని కెసిఆర్ యోచిస్తున్నాడట. ప్రస్తుతానికి ఈ విధంగా ఆలోచిస్తున్న కెసిఆర్ లాంగ్ టర్మ్ గోల్ మాత్రం బ్రహ్మాండమైనది ఫిక్స్ చేసారు. 

Also read: కవిత ఓటమి: బీజేపీ ఎంపీ అరవింద్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే...

కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్టు... కవిత ఓటమికి మాత్రం అనేక కారణాలున్నాయి. లోకల్ ఎమ్మెల్యేలు కవితకు వ్యతిరేకంగా పనిచేసారు అనే అంశం నుంచి మొదలుకొని పసుపు ఉద్యమం వరకు అనేక కారణాలు కనబడతాయి. ఏది ఏమైనా అన్ని ఎమ్మెల్యే సీట్లను గెల్చినప్పటికీ కూడా.... ఆ పార్లమెంటు స్థానాన్ని గెలవలేకపోవడం మాత్రం తెరాస కు షాక్ అనే చెప్పవచ్చు. 

కంచుకోట లేకనే...

ఈ నేపథ్యంలోనే... ఎట్టిపరిస్థితుల్లోనయినా గెలవగలిగే ఒక కంచుకోటను కవితకు శాశ్వత నియోజకవర్గంగా అందివ్వాలని కెసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారట. అందుకోసం కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ ను ఎంచుకున్నట్టు సమాచారం. 

మెదక్ ఎంపీ సీటు పరిధిలోకే సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్, హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు.  మిగిలిన నియోజకవర్గాలు ఎలా ఉన్నా... ఈ రెండు నియోజకవర్గాల మెజారిటీ చాలు కవితను గెలిపించడానికి అని కెసిఆర్ నమ్ముతున్నారట. 

Also read: కేకే స్థానంలో రాజ్యసభకు కవిత: నాయని నర్సింహా రెడ్డికి ఝలక్?

దానికి తోడు కనుచూపు మేరలో మెదక్ జిల్లాలో తెరాస ను ఎదుర్కొనే శక్తి లేదు.. జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ద్వారా మెదక్ ను ఒక హై ప్రొఫైల్  నియోజకవర్గంగా రూపుదిద్దాలని కెసిఆర్ భావిస్తున్నారు.

హైప్రొఫైల్ నియోజికవర్గాలుగా కనుక అభివృద్ధి అయితే... అక్కడ ప్రజలకు నేత ఎప్పుడు అందుబాటులో ఉంటే, ఎంతబలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ వారు అక్కడ ఓడిపోయే ఆస్కారమే ఉండదు. 

ఉదాహరణకు బారామతి ని తీసుకోండి. అది పావార్ల కంచుకోట. ఎంత ప్రచండమైన మోడీ పవనాలు వీచినా అక్కడ గెలిచేది పావార్లే. ఇలాంటి మరో నియోజిక వర్గం ఛింద్వారా. ఇది కమల్ నాథ్ కంచుకోట. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు.

ఈ రెండు నియోజకవర్గాల్లో ఇలా సిట్టింగులే గెలవడానికి కారణం అక్కడ చేసిన అభివృద్ధి. కాబట్టి కెసిఆర్ కూడా ఇలానే ఆలోచించి మెదక్ ను అలా చేసి కవితకు దాన్ని ఒక శాశ్వత కంచుకోటగా మార్చి కవితకు అందించాలనుకుంటున్నారు. 

అంతేకాకుండా కవిత కూడా అక్కడి నుండే పోటీకి దిగితే జిల్లాపై పూర్తి పట్టు సాధించవచ్చని, పూర్తి కుటుంబ కనుసన్నల్లోకి జిల్లా రావడం వల్ల జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చని కూడా కెసిఆర్ భావిస్తున్నారు. 

Also read: మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

ఈ ప్రచారమే గనుక నిజమయ్యి కవితను మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బరిలోకి దింపేందుకు కెసిఆర్ సమాయత్తమయితే... ఇంకొన్ని రోజుల్లోనే కవితను ఆక్టివ్ చేస్తారు. మునిసిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న గులాబీ బాస్ ఆ తరువాత తొలుతగా కవితను తెరాస బాధ్యతల్లోకి నెమ్మదిగా తీసుకువస్తారని చర్చ జరుగుతోంది. 

ఇలా షార్ట్ టర్మ్ లో ఆమెను తెరాస పార్టీ కార్యకలాపాల్లో బిజీగా చేసి ఆ తరువాత కూతురిని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలుగా మెదక్ స్థానం నుంచి గెలిపించుకోవాలని చూస్తున్నారు కెసిఆర్. ఇది ఆయన లాంగ్ టర్మ్ ప్లాన్. 

ప్రస్తుతానికి మాత్రం కవిత మునిసిపల్ ఎన్నికల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు విదేశాలకు వెళ్లారు. ఈ ఎన్నికల వేడి చల్లారాక ఆమె తిరిగి వస్తారని తెలుస్తుంది. ఆ తరువాత చూడాలి కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.