కేకే స్థానంలో రాజ్యసభకు కవిత: నాయని నర్సింహా రెడ్డికి ఝలక్?
కేకే స్థానంలో కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేకేను శాసన మండలికి తీసుకుని ముఖ్యమమైన పదవిని ఇస్తారని సమాచారం. నాయని నర్సింహా రెడ్డికి కేసీఆర్ ఝలక్ ఇస్తారని అంటున్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత కె. కేశవ రావు స్థానంలో తన కూతురు కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపించాలని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేశవరావు రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తోంది. కేశవరావును రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుంటారని లేదా ఆయనను శాసన మండలి చైర్మన్ గా నియమిస్తారని అంటున్నారు.
నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి ఓడిపోయిన తర్వాత కల్వకుంట్ల కవిత ఇటీవలి కాలం నుంచే కాస్తా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ లోకసభ స్థానం నుంచి ఓటమి పాలైన వినోద్ కుమార్ ను కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైఎస్ చైర్మన్ గా నియమించి, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఈ స్థితిలో కవితను రాజ్యసభకు పంపించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
నిజానికి, కేశవరావు శాసనసభ స్పీకర్ పదవిని ఆశించారు. తన కోరికను ఆయన గత శాసనసభ ఎన్నికల సమయంలో కేసీఆర్ వద్ద వ్యక్తం చేశారు. అయితే, పోటీ చేసేందుకు ఆయనకు తగిన స్థానం లభించకపోవడంతో అది జరగలేదు.
కేకే రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుండడంతో అదే సమయంలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం కూడా మార్చిలోనే ముగుస్తోంది. కర్నె ప్రభాకర్, నాయని నర్సింహా రెడ్డి, కాంగ్రెసుకు చెందిన రాములు నాయక్ పదవీ కాలాలు ముగుస్తున్నాయి. ఈ మూడు సీట్లను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
దాంతో రాజ్యసభ పదవీ కాలం ముగిసిన వెంటనే కేకేను శాసన మండలికి పంపించి, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. కేశవరావు కోరితే శాసన మండలి పదవి ఇవ్వవచ్చునని సమాచారం. కేకేను శాసన మండలి చైర్మన్ గా నియమిస్తే గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలుంటాయి.
ఎమ్మెల్సీగా నాయని నర్సింహా రెడ్డికి తిగిరి అవకాశం లభించకపోవచ్చునని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నాయకత్వంపైనే కాకుండా ఇటీవలి ఆర్టీసీ సమ్మెపై చేసిన వ్యాఖ్యల వల్ల నాయని నర్సింహా రెడ్డిపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నె ప్రభాకర్ ను తిరిగి శాసనమండలికి నామినేటే చేసే అవకాశం ఉంది.