ఆకాశంలో మేఘాన్ని చూసి కుండలో ఉన్న నీళ్లను పారబోసుకున్నట్టయ్యింది నిజామాబాదు జిల్లా వాసుల పరిస్థితి. అందునా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కవిత ఓడిపోవడంతో నిజామాబాదు అభివృద్ధి అటకెక్కిందని అందరూ అంటున్నారు. స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవం రెడ్డే ఈ విషయమై అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసారు కూడా. 

సీఎం కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవితను పట్టుబట్టి రైతులంతా ఒక్కటయ్యి ఏదో యుద్ధమన్నట్టుగా తమ శక్తులన్నీ క్రోడీకరించి ఓడించిన రైతులు ఇప్పుడు అనుభవిస్తున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి. పసుపు విషయమొచ్చిన ప్రతిసారి ఈ సంఘటనను వారు గుర్తు చేస్తున్నారు. 

అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని, కవితపై తిరుగుబాటు చేసేలా రైతులను ఉసిగొల్పిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇప్పుడు కోటి ఆశలు పెట్టుకున్న రైతుల ఊహలపై నీళ్లు చల్లాడు. 

Also read: కవిత భవిష్యత్తుపై కేసీఆర్ ప్లాన్ ఇదీ: శరద్ పవార్ ఫార్ములా

పసుపు బోర్డు తీసుకురావడం కష్టమని... ఉన్న బోర్డులలోనే కొన్నింటిని తగ్గించనున్నారని బాంబు పేల్చారు. సంక్రాతి వరకు ట్రై చేస్తానని మొదట చెప్పినా ఇప్పుడు అది జరిగే పనిగా కనిపించడం లేదు. రాష్ట్రప్రభుత్వ కోర్టులోకి బంతి వేసే ప్రయత్నం చేసినా, అది సక్సెస్ అయినట్టు కనపడడం లేదు. 

స్వయంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా కనీస పసుపు బోర్డు తేలేని ఎంపీ అరవింద్ అంటూ తెరాస వర్గాలు అక్కడ బహిరంగంగా విమర్శలు చేయడం మాత్రమే కాదు గ్రామగ్రామాన తిరిగి రైతులకు ఈ విషయం చెబుతున్నారు. దాంతో అక్కడి పసుపు రైతులు ఇప్పుడు పోరుబాట పట్టారు.

నమ్మించి మోసం చేసాడని నిజామాబాద్ రైతులు ఇప్పుడు బీజేపీ ఎంపీ అరవింద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎంపీ అరవింద్ ఎన్నికల సమయంలో రైతులను వాడుకొని వదిలేశాడని ఇప్పుడు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 

వీరికి తోడుగా నిజామాబాదు లోని విద్యార్ధి సంఘాలుసైతం అరవింద్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడ్డారు. డిసెంబర్ 31 తేదీలోగా గనుక పసుపు బోర్డు తేకుంటే గ్రామగ్రామాన బీజేపీ కార్యాలయాలు, నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని వారు అల్టిమేటం జారీ చేసారు. 

ఇలా అన్ని రంగాల ప్రజలు ముప్పేటదాడికి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రైతులు తాజాగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటకు మద్దతు ధర కోసం నేటి నుంచి రైతు జేఏసీ పాద్రయాత్రకు శ్రీకారం చుట్టింది. 

ఇక ఇదే మంచి అదునుగా భావించిన తెరాస రంగంలోకి దిగింది. వీరికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ నేతలు పసుపు బోర్డు కావాల్సిందేనని మరో ఉద్యమానికి తెర తీసేందుకు సమాయత్తమవుతున్నారు. 

రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులు తాము పార్టీలకతీతంగా యాత్ర చేపడుతున్నామని పేర్కొంటున్నప్పటికీ, దానిని ఎలాగైనా హైజాక్ చేయాలని, ఎంపీ అరవింద్ టార్గెట్ గా ఉద్యమం నిర్వహించాలని తెరాస నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. 

టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న రైతు నేతలు ఆదివారం సమావేశమై ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను రైతులను భాగస్వామ్యం చేసి అరవింద్ పై ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్టు వారు ప్రకటించారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై అక్కడి ప్రజలంతా రగిలిపోతున్నారు. ప్రజల్లో ఈ అసంతృప్తి జ్వాలలను మరింతగా పెంచేందుకు తెరాస శ్రేణులు అక్కడ చేయగలిగినదంతా చేస్తున్నారు. 

తమను నమ్మించి అరవింద్ మోసం చేశాడని తెరాస అనుబంధ రైతు సంఘంలోని సభ్యులు రోజూ తమ గ్రామంలో ఈ విషయాన్నీ పదే పదే చెబుతున్నారు.  వారంతా రైతులను వాడుకొని అరవింద్ వదిలేశాడని ఆరోపిస్తున్నారు. 

Also read: కవిత ఇష్యూ: కరుణానిధి, పవార్ బాటల్లోనే కేసీఆర్

కవితను ఓడించి పెద్ద తప్పు చేశామని, ఇటు పసుపు బోర్డు రాకపోగా... అభివృద్ధి కూడా పడకేసిందని వారు వాపోతున్నారు. ప్రజల పరిస్థితి ఎలా ఉన్నా తెరాస మాత్రం ఈ అవకాశాన్ని సాధ్యమైనంత స్థాయిలో ఉపయోగించుకొని పొలిటికల్ మైలేజ్ పొందాలని చూస్తుంది. 

స్వీట్ రివేంజ్ కి తెరాస నేతలు స్కెచ్చు వేస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్ ఎంపీని దెబ్బకొట్టే సమయం మాత్రం టీఆర్ఎస్ కు వచ్చింది. ఆయనపై ప్రతీకారానికి గులాబీ సేన సిద్ధమైంది. రైతుల ఆగ్రహాన్ని పెంచి పోషించి కరెక్ట్ సమయం చూసి ఆయనపైకి నెట్టేందుకు అధికార టీఆర్ఎస్ రెడీ అయ్యింది.