మహారాష్ట్ర రాజకీయాలు సడన్ ట్విస్ట్ తో ఒక్కసారిగా మారిపోయాయి. శివసేన ఉద్దవ్ థాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరం కలిసి అనుకుంటున్నాం అనే ప్రకటన రాగానే రాత్రికి రాత్రి ఊహించని పరిణామంతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా అజిత్ పవార్ కూడా ప్రమాణస్వీకారం చేసాడు. 

ఇప్పుడు అజిత్ పవార్ ను టార్గెట్ చేసుకొని శివసేన విమర్శలు గుప్పిస్తుంది. అజిత్ పవార్ మామూలు సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు. గతంలో కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అతను స్వయానా శరద్ పవార్ అన్న కొడుకు. శరద్ పవార్ కు తెలియకుండా తాను బీజేపీతో కలిసాడనే వాదనను ఎన్సీపీ తెర మీదకు తీసుకొస్తుంది. 

Also read: పవార్ జి... మీరు గొప్పవారయ్యా: కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి

ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే, నిజంగా శరద్ పవర్ కు తెలియకుండానే బయటకు వెళ్లాడా? దానికి అసలు ఛాన్సే లేదు. శరద్ పవర్ ను కాదని బయటకు వెళ్లే సీన్ అజిత్ పవార్ కు లేదు. ఎన్సీపీలోంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీచేసిన చాలా మంది ఓటమి చెందారు. ఇప్పుడు మిగిలిన వారందరూ, అయితేనా బీజేపీ ప్రలోభాలకు లొంగనివారు, లేదా శరద్ పవార్ నమ్మకస్థులు. 

అలాంటప్పుడు అజిత్ పవార్ బయటకు వెళ్లాడంటే, అందునా శరద్ పవార్ కు తెలియకుండా అంటే ఆలోచించాల్సిన అంశం. శరద్ పవర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అజిత్ పవార్ చర్యను ఖండిస్తున్నానని, ఇది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పినప్పటికీ నమ్మశక్యంగా లేదు. 

అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలుపుతున్న సంగతి తనకు తెలియదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చెబుతున్నారు. ఈ విషయం ఇవాళ ఉదయమే తనకు తెలిసిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే అజిత్‌పై స్పందించినప్పుడు శరద్ పవార్ కనబర్చిన మెతక వైఖరిపై ఒకింత సందేహం కలుగక మానదు. 

అజిత్ పవార్ చర్యలపై కేవలం ఒక ట్వీట్ తోనే శరద్ పవార్ సరిబెట్టారు. ఇప్పటివరకు అజిత్ పవార్ పై ఎటువంటి క్రమశిక్షణా చర్యలను కూడా తీసుకోలేదు. ఆ ట్వీట్ లో కూడా, కేవలం ఆయన నిర్ణయంతో తనకు గానీ, తన పార్టీకి గానీ ఎటువంటి సబంధం లేదని చెప్పుకొచ్చారు అంతే.   

Also read: 'మహా' మలుపు: ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్... ఎన్సీపీలో చీలిక?

ఎన్సీపీ అధినేత తన పార్టీని అజిత్ పవార్ నిట్టనిలువునా చీలుస్తానంటుంటే, చూస్తూ ఊరుకోడు. అతని నిర్ణయం ఎంతమాత్రమూ వ్యక్తిగత నిర్ణయం కాదు. తొలుత ప్రమాణ స్వీకారం చేయమన్నప్పుడు తమకు మెజారిటీ లేనందున తాము చేయబోమని ప్రకటించిన ఫడ్నవీస్, ఇప్పుడు కేవలం అజిత్ పవార్ ను మాత్రమే చూసుకొని ప్రమాణస్వీకారం చేసాడనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. 

మరోవైపు తమకు మద్దతుగా ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు పెట్టారని బీజేపీ ప్రకటించింది.  బీజేపీ మైండ్ గేమ్ ఆడడం కోసం ఈ మాట అంటున్నట్టు అనిపించవచ్చుగాని వాస్తవానికి పరిస్థితులు వేరు.   

ఇటీవల రాజ్యసభ 250 సెషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శరద్ పవార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలంటూ ఆయనను కొనియాడారు. 

ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల తరువాత పవార్ మోడీతో పార్లమెంటు భవనంలో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. మహారాష్ట్ర రైతు సమస్యలపైనే తాము చర్చించామని శరద్ పవార్ చెప్పినప్పటికీ, రాజకీయ దురంధరుడు శరద్ పవార్ రాజకీయాలు తప్ప ఎం మాట్లాడుతాడు. 

బీజేపీతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని కూడా అప్పుడే వార్తలు గుప్పుమన్నాయి. శరద్ పవార్ కు రాష్ట్రపతి పదవిని బీజేపీ కట్టబెట్టేందుకు ఒప్పుకుందని జోరుగా పుకార్లు సాగాయి. 

గతంలో సైతం మోడీ బాహాటంగానే శరద్ పవార్ ను ఆకాశానికి ఎత్తాడు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శరద్ పవార్ తనను వేలు పట్టుకొని నడిపించాడని అన్నారు. 

ఈ పరిణామాలపై మొదటి నుంచీ ఒకింత అనుమానపడుతున్న కాంగ్రెస్ పార్టీ,  పవార్ ప్రధానిని కలవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తీరా అజిత్ పవార్ బీజేపీతో కలిసి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింగ్వి ఏకంగా పవార్ జీ మీరు చాలా గొప్పవారయ్యా అని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. 

ఇలా అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖచ్చితంగా అతని వెనకున్న ఎమ్మెల్యేల సంఖ్యను చూసే అనేది సుస్పష్టం. అజిత్ పవార్ మీద కేసులున్న మాట వాస్తవం. అతను ఆ కేసులను ఎన్నికల ముందునుండే ఎదుర్కొంటున్నాడు. కాబట్టి అది కొత్త విషయం కాదు. అంతే కాకుండా శరద్ పవార్ కి ఒక ప్రత్యేకత ఉంది. అతను కాంగ్రెస్ తో కాపురం చేస్తూనే, బీజేపీ, శివసేనలతో ప్రేమాయణం నడపగలడు. 

2014లోనే శివసేన బీజేపీకి మద్దతివ్వకపోతే తాము సిద్ధమని ప్రకటించిన శరద్ పవార్, ఇప్పుడు 2019లో ఆ మాటను నిలబెట్టుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అంతే కాకుండా శరద్ పవర్ కు ఎప్పటినుండో బీజేపీ నేతలైన అమిత్ షా, నరేంద్ర మోడీలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ పవర్ తనంతట తానుగా పార్టీలోనుంచి బయటకు వెళ్ళాడు అనుకోవడం కష్టం. అంతే కాకుండా శరద్ పవర్ మార్కు రాజకీయాలను దగ్గరనుండి గమనించిన కాంగ్రెస్ మాత్రం ఎన్సీపీ డబల్ గేమ్ ను ఎట్టకేలకు అర్థం చేసుకున్నట్టుంది.