Asianet News TeluguAsianet News Telugu

'మహా' మలుపు: ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్... ఎన్సీపీలో చీలిక?

మహారాష్ట్ర రాజకీయాల్లో తిరిగిన ఊహించని మలుపుతో, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో సీఎం పీఠం ఎక్కాలన్న శివసేన ఆశలకు బీజేపీ గండికొట్టినట్టయ్యింది.  

'Maha'twist: ajith pawar episode...will there be a split in ncp?
Author
Mumbai, First Published Nov 23, 2019, 10:39 AM IST

ముంబై: బీజేపీకి మద్దతివ్వాలనే అజిత్ పవార్ నిర్ణయం తో తనకు కానీ, తన పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదని, ఆ నిర్ణయాన్ని ఎన్సీపీ ఏ విధంగానూ సమర్థించబోదని శరద్ పవార్ తన ట్విట్టర్ వేదికగా తెలియచెప్పాడు. మహారాష్ట్ర రాజకీయాల్లో తిరిగిన ఊహించని మలుపుతో, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో సీఎం పీఠం ఎక్కాలన్న శివసేన ఆశలకు బీజేపీ గండికొట్టినట్టయ్యింది.  

తెరవెనక చక్రం తిప్పిన అమిత్ షా, ఎన్సీపీని తన వైపుకు తిప్పుకోగలిగాడు. కూటమి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేనే ఉంటారని శుక్రవారం రాత్రే శరద్‌ పవార్‌ ప్రకటించారు. ఈలోపే దేవేంద్ర ఫడ్నవిస్‌ కేంద్ర పెద్దల సూచనలతో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌తో రహస్య మంతనాలు జరిపినట్టు సమాచారం. బీజేపీకి మద్దతిస్తె, డిప్యూటీ సీఎంతో పాటు ఇతర మంత్రివర్గ బెర్తులను ఇస్తామని చెప్పారట. 

అయితే తొలి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రేకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న అజిత్‌ పవార్‌ బీజేపీ నేతలతో చేతులు కలిపినట్లు సమాచారం. అజిత్‌  చర్యతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు షాక్‌కి గురయ్యారు.అయితే ఈ వ్యవహారమంతా శరద్‌ పవార్‌కు తెలియకుండా అజిత్‌ పవార్‌ జాగ్రత్త పడ్డారని ఎన్సీపీ వర్గాలంటున్నాయి. 

ఈ నేపథ్యంలోనే 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఎన్సీపీలో చీలిక తెచ్చారని వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో గెలుపొందిన  విషయం తెలిసిందే. 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 144 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్‌ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వంతంత్ర సభ్యుల మద్దతులో బలనిరూపణ చేస్తారని తెలుస్తోంది. ఈ చర్యలను ట్విట్టర్ ద్వారా ఖండించిన శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తో కలిసి మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టు ప్రకటించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios