ఢిల్లీ కాలుష్యం. ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకునే కన్నా దేశం యావత్తు అసలు కాలుష్యానికి కారణాలేంటి? ఎందుకు ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి? ఎందుకు కేంద్రం ఢిల్లీ సర్కార్ పైన, ఢిల్లీ సర్కార్ పక్క రాష్ట్రాలపైనా ఆరోపణలు చేస్తున్నారు? ఇవన్నీ సాధారణ ప్రజల మెదళ్లలో మెదిలే మిలియన్ డాలర్ ప్రశ్నలు. ఈ పరిస్థితికి అసలు కారణాలేంటో తెలుసుకుందాం. 

మొదటగా మాట్లాడుకునే ముందు ఇదేదో కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైన సమస్య అనుకుంటే పొరపాటే అవుతుంది. యావత్తు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం. 30 సంవత్సరాల నుంచి దీపావళి సమయంలో ఇలా కాలుష్యం కోరలు చాచి ఉత్తరాది వాసులకు ముఖ్యంగా ఢిల్లీ వాసులకు ఊపిరి ఆడకుండా చేస్తుంది. 

ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ సరి బేసి విధానం, పంట వ్యర్థాలను కాల్చొద్దని పంజాబ్,హర్యానా సర్కార్లు తీసుకున్న చర్యలైనా అన్ని కూడా కంటి తుడుపు చర్యలే. ప్రభుత్వం పంట వ్యర్థాలను కాల్చొద్దని చెప్పినా కూడా చాలామంది రైతులు కాలబెడుతూనే ఉన్నారు. వారిని పరిస్థితులు ఆ నిర్ణయం దిశగా పురికొల్పుతున్నాయి. 

ఈ కాలుష్యానికి నాలుగు ప్రధాన కారణాలు కనపడుతాయి. అవి నీళ్లు, విద్యుత్తు,పరిస్థితుల ప్రాబల్యం, మూర్ఖత్వం. నీళ్లు విద్యుత్తు ఎలా కారణమవుతాయి అని అనిపించొచ్చు. కానీ అది అక్షర సత్యం ఇలా ఒక దానికొకటి తోడై మూర్ఖత్వం వల్ల ఈ కాలుష్యం ఇంత తట్టుకోలేని స్థాయికి చేరుతుంది. 

పంజాబ్ లో వరి...తినేది ఎవరు మరి?

ఉత్తర భారత దేశంలో ప్రధాన ఆహార పంట గోధుమ. ఇప్పుడు అక్కడ రైతులు కాలుస్తున్నదేమో వరిపంట కోసిన తరువాత మిగిలిన కొయ్యలను. గోధుమ సాగుచేసే ప్రాంతంలో అక్కడి వారు ఎవరూ ప్రధాన ఆహారంగా తినకున్న ఎందుకు ఈ వరిపంటను సాగు చేస్తున్నారు?

ఎందుకంటే వరిపంటకు ప్రభుత్వం మద్దతు ధరను కల్పించడమే కాకుండా ఎంతైనా కొంటుంది. ఏ రైతు పండించిన ఎంత ధాన్యాన్నైనా ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కొనాల్సిందే. ఈ నేపథ్యంలో రైతులు వరిపంటను పండిస్తున్నారు. 

Also read: Delhi pollution: ప్రమాదకర స్థాయిలో కాలుష్యం..ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే!

ప్రస్తుతం భారత దేశంలో అవసరానికి మించి వారిని ఉత్పత్తి చేస్తున్నాము. ఇంతగనం వరిని పండిస్తుండడంతో  ప్రభుత్వం రకరకాల సబ్సిడీలను ఇచ్చి ఎగుమతి చేయాల్సివస్తుంది.  

ఇప్పుడు నీటి విషయానికి వద్దాము. ఒక్క టన్ను బియ్యాన్ని ఉత్పత్తి చేయడానికి 70 వేల టన్నుల నీరు అవసరమవుతుంది. మనం ప్రతి సంవత్సరం ఉత్పత్తి ఎక్కువయ్యి 12 మిలియన్ టన్నులను బయట దేశాలకు ఉత్పత్తి చేస్తున్నాం. దీనిప్రకారంగా గనుక చూసుకుంటే సంవత్సరానికి 84బిలియన్ టన్నుల అమూల్యమైన నీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నట్టు. 

డబ్బుల పరంగా గనుక మనం మాట్లాడుకుంటే, మామూలు బియ్యానికి 27 రూపాయలు, బాస్మతి బియ్యానికి 73 రూపాయలను మనము పొందుతున్నాము. ఎగుమతి చేస్తున్న 12మిలియన్ టన్నుల్లో 8మిలియన్ టన్నులు మామూలు బియ్యంకాగా కేవలం 4టన్నులు మాత్రమే బాస్మతి బియ్యం. 

ఎందుకింత అధిక ఉత్పత్తి?

వరిని పండించడానికి నీళ్లు అధికంగా కావలి. పంజాబ్, హర్యాణాలు బాగా నీటివసతి కలిగిన రాష్ట్రాలు. పంజాబ్లో 98 శాతం సాగునీటి లభ్యత ఉండగా, హర్యానాలో కూడా అది 90 శాతం పైమాటే. గతంలో పంజాబ్ లోని తెరాయ్ ప్రాంతాల్లో బాస్మతి మాత్రమే పండించేవారు. కానీ ఇప్పుడు అత్యంత వర్షాభావ పరిస్థితులుండే హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వరిని పండిస్తున్నారు. 

కారణం ఉచితంగా లభ్యమయ్యే భూగర్భ జలాలు. నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల ఇలా అధిక నీరు అవసరమైన వరి లాంటి పంటలు వేస్తున్నారు. భూగర్భ జలాలు అధికంగా ఉండడం, వాటిని బయటకు తోడడానికి ఉపయోగించే మోటార్లకు అవసరమైన విద్యుత్తు కూడా ఉచితం అవడంతో నీటిని ఇంకా ఎక్కువ మోతాదులో తోడుతున్నారు, వరి పంటను ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వేస్తున్నారు. 

Also read: ఢిల్లీ కాలుష్యం: హెల్త్ ఎమర్జెన్సీ విధింపు.. స్కూళ్లకు సెలవులు, మాస్క్‌లు తప్పనిసరి

ఖచ్చితంగా ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా పండించిన ధాన్యాన్ని ఖచ్చితంగా కనీస మద్దతు ధర చెల్లించి కొంటుంది. నీళ్లు,విద్యుత్తు ఫ్రీ. వరి పొలాల్లో పని చేయడానికి ఉత్తరప్రదేశ్, బీహార్ల నుంచి చీప్ గా లేబర్ కూడా లభ్యమవుతుండడంతో ఇంత అధిక మోతాదులో అవసరానికి మించి ఉత్పత్తి చేస్తున్నాం. 

ఇలా అధిక వరిని ఉత్పత్తి చేయడం వల్ల వరిని ఎక్కువగా స్టోర్ కూడా చేయాల్సి వస్తుంది. అక్టోబర్ 1వ తారీఖు వరకు 10.25 మిలియన్ టన్నుల బియ్యం ఆహార భద్రత నిలువల కోసం అవసరముండగా మన వద్ద 27.6 మిలియన్ టన్నుల బియ్యం గోడౌన్లలో మూలుగుతుంది. 

మూర్ఖపు చట్టాలు...పర్యావరణానికి నష్టాలు

రైతులు ఇలా భూగర్భ జలాలను తోడేస్తుండడంతో భూగర్భ నీటి లభ్యత బాగా పడిపోయింది. ఇలా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని పది సంవత్సరాల కింద హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఒకే రకమైన చట్టాలను రూపొందించాయి. 2009లో ప్రిజర్వేషన్ అఫ్ సబ్ సాయిల్ యాక్ట్ అనే చట్టాన్ని రూపొందించారు. 

ఈ చట్టం ముఖ్య ఉద్దేశం భూగర్భ జలాలను కాపాడడం. గతంలో రైతులు ఏప్రిల్ మాసానికి గోధుమ పంట చేతికి రావడంతోటే ఏప్రిల్ చివరికల్లా లేదంటే మే మొదటి వారంలో వరిని నాటేవారు. ఎండాకాలం కావడం వల్ల నీళ్లు ఎక్కువగా వాడుతున్నారని భావించిన ప్రభుత్వం జూన్ మధ్యవారాల వరకు అంటే రుతుపవనాలు వచ్చే వరకు వరిని నాటొద్దని చట్టం చేసింది. 

అలా చట్టం చేయడంతోని రైతులు జూన్ మధ్యలో రుతుపవనాలు వచ్చాక వరి నాట్లు వేస్తున్నారు. దానితో వరిపంట అక్టోబర్ లో లేదా నవంబర్ లో కొత్తకొస్తుంది. ఈ వరిపంటను ఎంత తొందరగా కోసేస్తే వారంతా తొందరగా రబి పంట అయిన గోధుమనూ విత్తుకోగలుగుతారు. లేదంటే ఆలస్యమయిపోతుంది. అప్పుడు రైతుకు పొలాన్ని సిద్ధం చేసుకోవడానికి సమయం తక్కువగా ఉండడం వల్ల పొలంలో కొత్త కోసిన తరువాత మిగిలిన కొయ్యలను కాల్చేస్తూ ఉంటాడు. 

Also read: టఫ్ కండీషన్స్, అయినా ఆడారు, థ్యాంక్స్: బిసీసీఐ చీఫ్ గంగూలీ

దక్షిణ భారత దేశంలో మిగిలిన కొయ్యలను కూడా కలిపి పొలానికి నీళ్లు పెట్టి వాటిని నాననిచ్చి దుక్కి దున్నుతారు. అలా పొలానికి బలం చేకూరుతుంది కూడా. కానీ ప్రభుత్వం చేసిన అనాలోచిత చట్టం వల్ల వారు వారి నాట్లు ఆలస్యంగా వేయడంతోని ఆలస్యంగా కోత కోస్తున్నారు. శీతాకాలంలో గాలులు హర్యానా పంజాబ్ ల మీదుగా ఢిల్లీకి వీస్తాయి. ఢిల్లీపై మాత్రం గాలులు స్తబ్దుగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో శీతాకాలంలో ఉండే స్థబ్ధత వల్ల ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. 

ఇంతకుమునుపంటే మేలో నాట్లు వేయడం వల్ల సెప్టెంబర్ లో కోత కోసేవారు. అప్పుడు కొయ్యలను తగులబెట్టిన కూడా రుతుపవనాలు వీస్తుండడం వల్ల కాలుష్యం ఢిల్లీ నుండి దూరంగా వెళ్ళేది. 

ఇలా ప్రభుత్వం అనాలోచిత చట్టం ఇన్ని నష్టాలకు దారితీస్తుంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయంటే చేయాల్సిన పని ఎండాకాలంలో నీటిని తొడకుండా అడ్డుపడడం కాదు. అనవసరమైన, అతిగా ఉత్పత్తి అవుతున్న వరి నుంచి రైతులను మళ్లించాలి. తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి తప్ప వరిని వేసుకోండి, కాకపోతే రెండు నెలలాగండీ అనడం అసలు సమస్యకు పరిష్కారం కాదు. 

సమస్యకు పరిష్కారం... 

ఈ సమస్యకు పరిష్కారమార్గం కావాలంటే సరి బేసి విధానాలు, దీపావళి వేళ పటాకులు పేల్చకుండా ఆపడం కాదు. శాశ్వత పరిష్కార మార్గం కావాలంటే వరి  నుంచి రైతును వేరే ఇతర ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలి. 

ఉదాహరణకు మొక్కజొన్న పంట. మొక్కజొన్న పంటకు నీరు చాలా తక్కువ అవసరమవుతుంది. వరికి అవసరమయ్యే నీటిలో 5వ వంతు నీరు మొక్కజొన్న పంటకు సరిపోతుంది. ఇక్కడే ఒక అనుమానం కలగవచ్చు. మన దేశంలో మొక్కజొన్న ఎక్కువగా తిన్నాము కదా, మరి ఎలా అని. మన దేశంలో 20 నుంచి 25 శాతం మాత్రమే మనుషులు తింటుండగా 50 శాతం పౌల్ట్రీ రంగంలో దాణాగా ఉపయోగించబడుతుంది. మిగిలిన 20 శాతం చైనీస్ వంటకాలకు సంబంధించిన ఆహార పదార్థాలు తయారీలో వాదుధ్జుంటాము. 

మరి ఇంత భారీ మోతాదులో ఉత్పత్తి చేసిన మొక్కజొన్నను ఎం చేయాలి? దాని నుండి ఇథనాల్ తీసి మామూలు ఇంధనంలో కలిపి వాడవచ్చు. అప్పుడు ఉద్గారాలు తగ్గుతాయి. పెట్రోలియం దిగుమతి కూడా తగ్గుతుంది. అమెరికా సైతం సంవత్సరానికి 120 మిలియన్ టన్నుల మొక్కజొన్న నుండి ఇథనాల్ తయారు చేస్తుంది. 

కేవలం మొక్కజొన్ననే కాకుండా, కూరగాయలు, పండ్లు వంటి ఇతర పంటలను కూడా పండించవచ్చు. ఢిల్లీ సమీపంలోనే ఉన్న పెద్ద నగరం కాబట్టి పండించిన పండ్లు కూరగాయలకు అక్కడ డిమాండ్ ఉంటుంది. 

పైన పేర్కొన్న పరిష్కార మార్గాలు బాగానే ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది రైతుల్లో, రైతుల ఆలోచనా సరళిలో మార్పు తీసుకురావాలి. ఇది సాధ్యమవ్వాలంటే దేశంలో ఉన్న సెలెబ్రిటీలు, అధికారులు అందరూ కలిసి రైతులకు ఈ సమస్యను పూర్తిగా అర్ధమయ్యే రీతిలో చెప్పాలి. ప్రస్తుతానికి మన దేశంలో  ఒకరి స్వభావాన్ని సైతం ప్రభావితం చేయగలిగిన ప్రభావ శాలి ఎవరన్నా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోడీ. ఇది ఆయన తోనే ప్రారంభమవ్వాలి. 

చెప్పినా కూడా రైతులు వింటారా అంటే వైన్ ఆస్కారం తక్కువ. పోనీ వారికి అధికంగా నీటి లభ్యత ఉంది, ఉచిత కరెంటు వల్ల తోడుతున్నారు కాబట్టి మనం ఆ నీటికి బిల్లు కట్టమని రైతును అందామా? రాజకీయంగా అది సాధ్యమవ్వదు. ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపెడుతూ ప్రపంచ బ్యాంకు సహాయంతో ఒక పైలట్ ప్రాజెక్టును పంజాబ్ లో ప్రారంభించారు. 

Also read: video news : వచ్చే శతాబ్దానికల్లా యేటా పదిహేను లక్షల మరణాలు

రైతు మీద విద్యుత్తు చార్జీల గుదిబండను మోపే బదులు, ఆదా చేసిన విద్యుత్తుకు రైతుకు తిరిగి ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. "పానీ బచావో పైసా బానవో" అనే పేరుతో ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టు లో భాగంగా రైతు తాను మిగిల్చిన విద్యుత్తుకు అధికారులు రైతులకు డబ్బులు ఇస్తారు. 

ఉదాహరణకు ఒక రైతుకు 1000 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తుంది అనుకుందాం. రైతు గనుక 800 యూనిట్లు వాడాడు అనుకుందాం. అప్పుడు రైతు తన కోటాలో 200 యూనిట్ల కరెంటును ఆదా చేసినందుకు ఆ 200 యూనిట్లకు రైతుకు అధికారులు లెక్కగట్టి డబ్బులు ఇస్తారు. ఈ విధంగా రైతులు తక్కువ విద్యుత్తును వాడడం వల్ల తక్కువ భూగర్భ జలాలను వాడుతారు.  

తద్వారా రానున్న మున్ముందు కాలంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి వరి పంట నుంచి దూరంగా జరిగి ప్రత్యామ్నాయ పంటల దిశగా అడుగులు వేస్తాడు. తద్వారా పంట వైవిధ్యీకరణ జరిగి భూసారం కూడా మెరుగవుతుంది. సాధారణ బియ్యం సాగు ఆగిపోయి అధిక ధరలు పలికే బాస్మతిని మాత్రమే పండిస్తారు. 

ఢిల్లీ కాలుష్య పరిష్కారానికి ఏవో కంటితుడుపు చర్యలకన్నా, సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలి. అప్పుడు మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉండడం, హర్యానాలో కూడా వారి ప్రభుత్వమే ఉండడం, దానికి తోడు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కూడా చాలా ముందు చూపు కలిగిన నాయకుడవ్వడం వల్ల రాజకీయ పరిష్కారం లభించడం అంత కష్టమైన పని మాత్రం కాదు.