వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు జగన్ అష్టకష్టాలు పడుతుంటే.. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ కి షాక్ లు మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే 22మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. కాగా.. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆమెను పార్టీ నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకు స్వయంగా జగనే రంగంలోకి దిగి బుజ్జగింపులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యే జగన్ కి షాక్ ఇచ్చాడా?.

అసలు విషయం ఏమిటంటే.. జగన్ ప్రజా సంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో  సాగుతోంది. ఆయనకు జిల్లావాసులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే..  ఆయన పాదయాత్ర ఇంకా కర్నూలు జిల్లాలో ముగియనేలేదు ఆలోపే ఆధోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది. అందుకు కారణం లేకపోలేదు. సాయి ప్రసాద్ రెడ్డి.. టీడీపీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. దీంతో అందరూ ఆయన టీడీపీలో చేరడం ఖాయమని చర్చించుకుంటున్నారు.

టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయని ఎమ్మెల్యే అన్నాడు. అక్కడితో ఆగలేదు. వైఎస్ఆర్  హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల క్వాలిటీ చాలా చీప్ గా ఉందని విమర్శించాడు. దీంతో ఈయన సైకిల్ ఎక్కాలనుకుంటున్నాడని.. అందుకే  ఇలా మాట్లాడుతున్నాడనే  వాదనలు వినపడుతున్నాయి.