Asianet News TeluguAsianet News Telugu

కోడెల నన్ను నానా రకాలుగా వేధించాడు..

  • కోడెలపై విరుచుకుపడ్డ అంబటి
  • కోడెల నేరాలు చేశాడన్న అంబటి రాంబాబు
  • తనను కోడెల వేధించాడన్న అంబటి
ycp leader ambati fire on kodela shiva prasadarao

శాసనసభ అన్నా, సభాపతి అన్నా తనకు అపారమైన గౌరవముందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్లు శాసనసభ్యుడిగా కొనసాగిన తనకు సభ సంప్రదాయాలు పూర్తిగా తెలుసని ఆయన చెప్పారు. తనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం తీసుకురావాలని అసెంబ్లీలో మంగళవారం టీడీపీ సభ్యులు కోరిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

 తానూ ఎప్పుడూ సభాపతిగానీ, సభనుగానీ అగౌరవపరచలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు. అలా చేసినట్టు ఎవరైనా భావిస్తే.. క్షమించాల్సిందిగా కోరుతున్నానన్నారు. రాజకీయ ప్రత్యర్థి అయిన కోడెల శివప్రసాదరావును రాజకీయంగా విమర్శించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. తనకు కోడెల మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయన్నారు.

కోడెల, తాను గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో కోడెల తనపై 924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి  ఇప్పటి వరకు తనను తన పార్టీ కార్యకర్తలను అభిమానులను కోడెల తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన క్యాడర్‌ను  పోలీస్ స్టేషన్ కి పిలిపించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. రౌడీషీట్‌లు పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు చేయడం తన బాధ్యత అని.. అందుకే విమర్శిస్తున్నట్లు చెప్పారు.

తాను పేకాట క్లబ్ నడుపుతున్నారని విమర్శించారన్నారు. అది పేకాట క్లబ్ కాదని, క్యారమ్స్, షటిల్ ఆడుకునే క్లబ్ అని చెప్పారు. కోడెల, ఆయన కుమారుడు 1445 గజాలు ఉన్న స్థలాన్ని మింగేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్లబ్  విషయంలో తాము కోర్టుకు వెళ్లి విజయం సాధించామన్న విషయాన్ని అంబటి గుర్తు చేశారు. నడిపుడి- కాళహస్తీ రైల్వే ట్రాక్ వేస్తున్నారని.. ఆ రైల్వే కాంట్రాక్టర్ పన్నుచెల్లించలేదని ఆ కాంట్రక్టర్ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. రూ.11కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టినానని కోడెలే స్వయంగా ఓ టీవీ ఛానెల్ కి చెప్పారన్నారు. అది నేరం కాదా అని అంబటి ప్నశ్నించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చుపెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చుపెడితే... ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన లేదా అంటూ ప్రశ్నించారు.

1999లో కోడెల ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ జరిగిందని .. ఆ సమయంలో ఐదుగురు చనిపోయారని చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టిందని.. ఆ కేసుపై క్లీన్ చిట్ ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని, అది అబద్ధమని ఆయన ఆరోపించారు. ఈ కేసులో కోడెల తప్పుచేసినట్లు సీబీఐ నిరూపించిందని .. ఆయనను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ సెంట్రల్ గవర్నమెంట్ కోరినట్లు చెప్పారు. అయితే.. చంద్రబాబు తన పరపతి ఉపయోగించి అనుమతి రాకుండా చేశారన్నారు. వీటన్నింటికి సంబంధించి  తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios