అలనాటి సుప్రసిద్ధ తెలుగు కవి, సినీ రచయిత ఆరుద్ర భార్య, తానుకూడా స్వయంగా రచయిత్రి అయిన రామలక్ష్మి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఆసక్తికరమయిన విషయాలు వెల్లడించారు. అంతేకాదు,పలువురు తెలుగు ప్రముఖుల బలహీనతలని కూడా బయటపెట్టారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జయలలిత చావు నేపథ్యాన్ని చూపించారు.  అంతేనా, జయలలిత తల్లి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత సుబ్బారావు కీప్ అని కూడా అన్నారు. వేయిపడగల విశ్వనాథ మట్కా అడే వారట.

 

ఇవే ఆమె వెల్లడించిన విశేషాలు

 

జయ మరణానికి కారణం శశికళేనని చెప్పారు. జయ ఆసుపత్రి పాలవటానికి కారణం ఆ రోజున మాటా మాటా వచ్చి శశికళ ఆమెను మంచంపైనుంచి లాగటమేనని అన్నారు. జయఇంట్లో ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న బ్రాహ్మణ వంటమనిషి ఇది చూసి కిందపడిన జయను లేపటానికి ప్రయత్నించగా, చంపేస్తానంటూ శశికళ బెదిరించిందని రామలక్ష్మి తెలిపారు. ఆ రోజు ఆసుపత్రిలో చేరిన జయ మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదని చెప్పారు. ఆసుపత్రిలో గవర్నర్ ను కూడా చూడటానికి వెళ్ళనీయలేదని తెలిపారు. శశికళ లాంటి క్రూరమైన మనిషి ఎవరూ ఉండరని అన్నారు. డబ్బు దోచుకుని కూడా శశికళ ఇలా చేయటం దారుణమని వ్యాఖ్యానించారు. 

ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారనే పేరున్న రామలక్ష్మి అప్పట్లో మద్రాస్ లో ఉండే చలనచిత్రపరిశ్రమలోని అనేక రహస్యాలను బయటపెట్టారు. జయకు, శోభన్ బాబుకు మధ్య బంధం గురించి కూడా రామలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. శోభన్ భార్య గవిడిగేదలాగా ఉంటుందన్నారు. తన గురువుగారిపై ఉన్న కృతజ్ఞతా భావంతో ఆయన కుమార్తెను పెళ్ళి చేసుకున్నట్లు శోభన్ తనకు చెప్పారని తెలిపారు. జయ శోభన్ కు వడ్డించే ఫోటో వెనక కథను వివరిస్తూ, గోరింటాకు చిత్రం షూటింగ్ జయలలిత ఇంట్లో జరిగిందని, అప్పుడు యూనిట్ అందరికీ ఆమె భోజనాలు పెట్టిందని, తానే స్వయంగా వడ్డించిందని రామలక్ష్మి వెల్లడించారు. జయ శోభన్ ను బాగా ప్రేమించిందని, శోభన్ కు కూడా జయపైన ప్రేమ ఉన్నప్పటికీ, అతనికి భార్యను వదిలే ఉద్దేశ్యం లేదని, అతను చాలా నిజాయితీపరుడని చెప్పారు. జయలలిత లేకపోవటంతో తమిళనాడు అసెంబ్లీలో పెద్దదిక్కే లేకుండా పోయిందని, ఇప్పుడు అక్కడ స్టాలినే పెద్ద తలకాయగా కనబడుతున్నాడంటూ వెక్కిరించారు. స్టాలిన్ నివసించే వీధిలో నడవటానికి యువతులు భయపడతారనే విషయం మద్రాస్ లో అందరికీ తెలుసని రామలక్ష్మి తెలిపారు.

జయలలిత తల్లి సంధ్య ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత సుబ్బారావు కీప్ అని చెప్పారు. భానుమతి ‘పద్మశ్రీ’ కోసం నాటి రాష్ట్రపతి సంజీవరెడ్డిని ఆశ్రయించిందని తెలిపారు. భానుమతి, సూర్యకాంతం కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ ఉండేవారని చెప్పారు. సినిమాపరిశ్రమలో ఉన్నంతమంది మోసగాళ్ళు, మాయమాటలు చెప్పేవారు ఎక్కడా ఉండరని అన్నారు. ఎన్టీరామారావు భోళా మనిషి అని, నాగేశ్వరరావు డాంబికం ప్రదర్శించటానికి ప్రయత్నిస్తుండేవారని అన్నారు. శివాజీ గణేశన్ లాంటి నటుడు తెలుగులో లేడని వ్యాఖ్యానించారు. సావిత్రిని కొందరు మోసంచేసి దోచుకున్నారని, ఆఖరి రోజుల్లో ఆమెకున్న గోల్డ్ బాండ్స్ ను కొందరు సంతకాలు చేయించుకుని తీసుకున్నారని తెలిపారు. మోహన్ బాబులాంటి చీప్ మనుషులు తనకు ఇష్టముండదని చెప్పారు. వేయిపడగలు రచయిత విశ్వనాథ సత్యనారాయణ బ్రాకెట్ ఆడేవారని, తాను ఈ విషయం ఆయననే అడిగానని కూడా చెప్పారు. రచయిత ముళ్ళపూడి వెంకటరమణను ముంచేశారని, ఆయనను మోసంచేసిన విషయంలో కృష్ణంరాజును కూడా తాను ప్రశ్నించానని తెలిపారు. శ్రీశ్రీ కవిత్వం గొప్ప కవిత్వమేమీ కాదని రామలక్ష్మి అన్నారు(శ్రీశ్రీ ఆరుద్రకు మేనమామే). మందుతాగటం తప్పేమీ కాదని, శ్రీశ్రీ అంతలా తాగటం మాత్రం తప్పేనని చెప్పారు. ఆ మాటకొస్తే తాను, తన భర్తకూడా తాగుతామని, అదేమీ పాపం కాదని రామలక్ష్మి అన్నారు. (బ్యానర్ ఫోటో సౌజన్యం: ప్రెస్ కెెఎస్)