Asianet News TeluguAsianet News Telugu

కమల్... మరో ఎంజీఆర్ కాగలడా?

  • రాజకీయ  ప్రవేశం చేస్తానంటున్న కమల్
  • కొత్త పార్టీ పెట్టే యోచనలో కమల్
Why its not easy for Kamal  to do a MGR

రాజకీయాల్లోకి అడుగుపెట్టడం అంటే మాములు మాటలు కాదు. ఒక్కసారి ఆ దిశగా అడుగులు వేస్తే.. ఎలాంటి వాటినైనా తట్టుకోగల శక్తి ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు..  ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. కొందరు మద్దతు ఇస్తే.. మరికొంత మంది విమర్శిస్తారు. పొగడ్తలను ఎలా స్వీకరించారో.. అదే విధంగా విమర్శలను కూడా స్వీకరించగలగే ఓర్పు కూడా ఉండాలి. ఇవన్నీ తట్టుకున్నప్పుడే.. ఓ రాజకీయనాయకుడిగా ఓ గుర్తింపు వస్తుంది.  అలాంటి రాజకీయాల్లోకి ఇప్పటి వరకు చాలా మంది సినీ ప్రముఖులు అడుగుపెట్టారు. ఆ దిశగా విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా అడుగులు వేస్తున్నారు.

కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే.. తాను సొంతంగా పార్టీ పెడతారా.. లేదా ఏదైనా పార్టలో చేరతారా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేదు. ఇప్పటికే ఉన్న ఏదైనా పార్టీలో ఆయన చేరితో పరిస్థితి ఒకలా ఉంటుంది. అలా  కాదని ఆయన సొంత పార్టీ పెడితే మరోలా ఉంటుంది. సాధారణంగా రాజకీయాల్లోకి రావడమే ఒక సవాలు అంటే.. పార్టీ పెట్టడం మరో సవాలు. అందులోనూ తమిళనాడు రాష్ట్రంలో అది చాలా పెద్ద సవాలనే చెప్పవచ్చు. ఎందుకంటే.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో.. పెద్ద పార్టీలు అంటే.. రెండు.. మూడు.. మహా అయితే నాలుగు ఉంటాయి. ఎన్నికల్లో పోటీ.. వాటి మధ్యే ఉంటుంది. చిన్నా చితక పార్టీలు ఉన్నా.. వాటి ప్రభావం ఎన్నికల్లో కనపడదు. కానీ.. తమిళనాడులో అలాకాదు.

అక్కడ జిల్లాకోక పార్టీ ఉంటుంది. పెద్ద పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, భాజపాలే కావచ్చు. కానీ అవి అధికారంలోకి రావాలన్నా.. ఈ జిల్లాలోని చిన్న పార్టీల అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే.. అక్కడి ప్రజలు.. ఆ చిన్న పార్టీలకే ఓట్లు వేస్తారు. స్థానికంగా తమకు తెలిసిన పార్టీవైపే మెగ్గు చూపుతారు. డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే లాంటి పార్టీలు మొత్తం 40 ఉన్నాయి. ఓట్లు చీలిపోకుండా ఉండేందుకే పెద్ద పార్టీలు చిన్న  పార్టీలను అక్కున చేర్చుకంటుంటాయి. అన్నాడీఎంకే లాంటి పార్టీలు అధికారంలోకి వస్తున్నది అలానే.

 ఇలాంటి తమిళనాడులో పార్టీ పెడతానని చెబుతున్నాడు సినీనటుడు కమల్ హాసన్. ఎంజీఆర్, కరుణానిధులు 60ల కాలంలో సినీ రంగం నుంచి వచ్చి పార్టీలు పెట్టారు.వాళ్లు పార్టీలు పెట్టిన సమయంలో కాంగ్రెస్ తప్ప వేరే పెద్ద పార్టీ ఏదీ లేదు. రాజకీయ శూన్యత ఉన్న సమయంలో వారు పార్టీలు పెట్టి తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పు తీసుకువచ్చారు. ఇప్పుడు నడుస్తున్నది 2017 వ సంవత్సరం. పార్టీ పెట్టి రాణించడమంటే అంత సులవైన పనేమీ కాదు.

ఇప్పటికే కుప్పలు తెప్పలుగా పార్టీలు ఉన్నాయి. ఇన్ని పార్టీల్లో  కమల్ పెట్టే కొత్త పార్టీకి గుర్తింపు వస్తుందా లేదా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సినీ నటుడిగా అశేష అభిమానులు కమల్ సొంతం కనుక  ఆయన పెట్టే పార్టీ పట్ల అందరకీ ఆసక్తి కనపడుతోంది. కానీ.. ఆ ఆసక్తి చివరి దాకా ఉండాలంటే.. రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు సాధించుకోవాలి. మరి ఎంజీఆర్ లాగా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతాడా లేదా.. విజయ్ కాంత్ లాగా డీలా పడిపోతాడో వేచి చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios