ఇంతకీ గిడ్డి ఈశ్వరి కథేంది?

what is the real story behind the ycp mla giddi eswari
Highlights

  • పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
  • టీడీపీలో చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం
  • బుజ్జగింపులు మొదలుపెట్టిన జగన్

గిడ్డి ఈశ్వరి... ప్రస్తుతం అందరినోటా నానుతున్న పేరు. ఆమె టీడీపీలో చేరతారా? లేదా వైసీపీలోనే కొనసాగుతారా అనే విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పటికే  ఎల్లో మీడియాలు.. దాదాపు గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరినట్టే అంటూ వార్తలు ప్రచురిస్తున్నాయి. మరోవైపేమో ఆమె తాను వైసీపీలోనే కొనసాగుతానని చెబుతుండటం గమనార్హం. అసలు ఈ ఈశ్వరి కథేంటో మనం ఒకసారి చూద్దాం...

గిడ్డి ఈశ్వరి గత ఎన్నికల్లో వైసీపీ గుర్తుతో పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలిరోజుల్లో నియోజకవర్గం కోసం బాగానే కృషి చేశారు. అక్రమ మైనింగ్ లకు వ్యతిరేకంగా పోరాటం కూడా చేశారు. దీంతో.. నియోజకవర్గం మొత్తాన్ని గ్రిప్ లోకి తెచ్చుకున్నారు. పక్క నియోజకవర్గమైన అరుకులో కూడా ఆమె తన హవా కొనసాగించాలనుకున్నారు. దీంతో తనకు తెలిసిన  ఫాల్గుణి అనే వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుంచి సీటు ఇప్పిస్తానని మాట ఇచ్చింది. అధిష్టానమేమో మరో వ్యక్తికి సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు వ్యక్తుల్లో జగన్ ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు.. కానీ ఆ ఇద్దరు ఇప్పటినుంచే అక్కడ ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయంలో అధిష్టానానికి ఈశ్వరికి చెడింది అన్న ప్రచారం జరుగుతోంది.

కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరగడంతో.. ఆమె ముందు జాగ్రత్త చర్యగా తన మకాం ని విశాఖ కు మార్చారు. దీంతో పార్టీ క్యాడర్ కి  ప్రజల మధ్య దూరం పెరిగింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఇదిలా ఉండగా.. మరోవైపు వైసీపీ నేతలను తమ పార్టీ లోకి చేర్చుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న  టీడీపీ నేతలు ఆమెకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె కూడా వైసీపీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారని.. టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్, విజయసాయి రెడ్డిలు ఆమెను బుజ్జగించే పనిలో పడ్డారు. మరి వీరి బుజ్జగింపులు ఫలిస్తాయో, టీడీపీ గాలమే పనిచేస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాలి.

loader