ఇవాంకా ట్రంప్.. హైదరాబాద్ పర్యటన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చించుకుంటున్న టాపిక్ ఈ ‘సన్ బర్న్’. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం ఈ సన్ బర్న్ ఈ వెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ ప్రకటించిన నాటి నుంచి రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. విషయం కోర్టులో వాదోపవాదనలు వినే స్థాయికి కూడా చేరింది. ఇంతకీ అసలు ఈ సన్ బర్న్ షో అంటే ఏమిటి..? దీని వల్ల కలిగే లాభమేంటి? నష్టమేంటి..? ఎందుకు దీనిని కొందరు అడ్డుకోవాలనుకుంటున్నారు? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం..

ఈ సన్ బర్న్ ఫెస్టివల్ పాశ్చాత్య దేశాల సంస్కృతి. అక్కడ బాగా పాపులర్ అయ్యాక.. నెమ్మదిగా మన దేశంలోకి కూడా పాకింది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటంటారా.. పెద్ద పెద్ద సౌండ్స్ తో హుషారెత్తించే పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు. పూనకాలు వచ్చినట్టు అందరూ ఊగిపోతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో మ్యూజికల్ డ్యాన్స్ ఫెస్టివల్.

వారమంతా ఆఫీసుల్లో వర్క్ లు చేసి అలసిపోయినవారు ఈ ఫెస్టివల్ లో చిల్ అయిపోవచ్చు. అందుకే వేల సంఖ్యలో ఈ ఫెస్టివల్ కి హాజరౌతారు. ఇంతమంది ఒకేచోట ఉన్నారంటూ వారికి ఫుడ్, డ్రింక్స్ లాంటివి కూడా అవసరమే కదా. అందుకే ఫెస్టివల్ దగ్గరే ఫుడ్ స్టాల్స్, షాపింగ్ స్టాల్స్ కూడా పెట్టేస్తుంటారు.  అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే.. ఎలాంటివారికైనా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఎప్పుడూ డ్యాన్స్ చేయనివారు కూడా అక్కడికి వెళ్లారంటే కాళ్లు కదపకుండా ఉండేలేరు. అందుకే ఈ సన్ బర్న్ కి అంతక్రేజ్.

అయితే.. మన హైదరాబాద్ నగరంలో ఇలాంటి నిర్వహించడం ఇది తొలిసారి కావడంతో వివాదాస్పదమౌతోంది. అందులోనూ మద్యానికి కూడా అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు కోరుతుండటంతో వివాదం పీక్స్ కి చేరింది. ఇదిలా ఉంటే.. మైనర్లకు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారంటూ ఒకరు కోర్టుకు ఎక్కగా.. దీనిపై వాదోపవాదనలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్ బర్న్ షో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈ షో విషయాన్ని మీడియాకు వెల్లడించడం, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో ఈ ఈవెంట్ పాపులర్ అయ్యింది. ఈ షో నిర్వహణకు తాజాగా కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జాగ్రత్తగా నిర్వహిస్తారా లేదా తాగి గొడవలు సృష్టిస్తారా అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.