పెళ్లి ముసుగుతో... మోసాలు  ఒంటరి, భర్త కోల్పోయిన మహిళలే లక్ష్యం భారీ మొత్తంలో నగదు కొట్టేస్తున్న ఘరానా మోసగాళ్లు

ఇంట్లో పెళ్లి కావాల్సిన అబ్బాయి కానీ.. అమ్మాయి కానీ ఉంటే.. ఏమి చేస్తారు..? వారికి సంబంధించిన సమాచారాన్ని మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల లో పొందుపరిచి మంచి సంబంధం కోసం వెతుకుతారు. ఒకప్పుడంటే.. పెళ్లిళ్ల పేరయ్యల ద్వారా సంబంధాలు కుదుర్చుకునే వారు. కానీ ఇప్పుడు అలా కాదు.. అందరూ మ్యాట్రి మోనీ వెబ్ సైట్ల పైనే ఆధార పడుతున్నారు. చాలా మంది వాటి ద్వారా పరిచయమై.. వివాహ బంధంతో ఏకమైన వారు కూడా ఉన్నారు. అయితే.. వీటి వెనుక కొందరు.. ఎవరూ ఊహించని కుట్రలకు పాల్పడుతున్నారు. ఇప్పుడిప్పుడే.. కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏమిటా కుట్ర..? ఎవరు చేస్తున్నారు..? తెలుసుకోవాలనుందా.. ఇంకెందుకు ఆలస్యం చదవండి..

 హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన కావ్య(పేరు మార్చాం)కి రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆనందంగా సాగుతున్న వారి దాంపత్యంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అమ్మాయి వయసు ఎక్కువ కాదు.. పిల్లలు కూడా లేకపోవడంతో.. ఆమెకు రెండో వివాహం చేయాలని నిశ్చయించారు కుటుంబసభ్యులు. ఆమె సమాచారాన్ని ఓ ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఆ సమాచారం చూసిన ఓ వ్యక్తి.. వారి కుటుంబసభ్యలను పరిచయం చేసుకున్నాడు. కావ్య ఫోన్ నెంబర్ తీసుకొని తరచూ మట్లాడుతూ ఉండేవాడు. పరిచయం బాగా పెరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనే భావనకి వచ్చారు. అప్పటి నుంచి ఆ వ్యక్తి.. ఏదో సాకు చెబుతూ ఆమె దగ్గర నుంచి డబ్బులు లాగడం మొదలు పెట్టాడు. మొదట అడిగినప్పుడల్లా ఇచ్చిన కావ్య.. తర్వాత అతనిపై అనుమానం కలిగింది. అతనిని ప్రశ్నించేలోపే.. ఫోన్ నెంబర్ మార్చేశాడు. వాకబు చేస్తే.. అతను చెప్పిన సమాచారమంతా తప్పు అనితేలింది. దీంతో మోసపోయినట్లు గుర్తించారు కావ్య కుటుంబసభ్యులు.

కేవలం కావ్య విషయంలోనే కాదు. చాలా మంది వింతతువులు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం అలాంటి వారి సమాచారం కోసమే మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో ఖాతాలు తెరుస్తున్నారు. తరువాత వారిని చిన్నగా నమ్మించి.. రూ.వేలు.. రూ. లక్షలు కాజేస్తున్నారు. మహిళలను నమ్మించేందుకు తాము ఎన్ఆర్ఐ లమని చెప్పడం.. అప్పుడప్పుడూ చిన్న చిన్న గిఫ్ట్ లు కూడా ఇస్తున్నారు. వారు పూర్తిగా నమ్మేసారనుకోగానే.. వారి వద్ద నుంచి నమ్మకంగా మాటలు చెప్ప నగదు దోచేస్తున్నారు. ఇక వారి దగ్గర నుంచి డబ్బు రాదు అని తెలిసిన వెంటనే..పత్తా లేకుండా పారిపోతున్నారు.

అయితే.. ఇలాంటి సంఘటనలు మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఎదురౌతున్నాయి. కొందరు మాయ లేడీలు.. పురుషులను వలలో వేసుకొని వారి దగ్గర నుంచి నగదు కొట్టేస్తున్నారు. ప్రాంతానికో పేరు మారుస్తూ..పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. దగా చేస్తున్నారు. అలా మోసం చేస్తూ.. ఓ మహిళ పోలీసులకు చిక్కిన సంఘటనలు కూడా మనం చూశాం.

ప్రముఖ మ్యాట్రీమోనీ వెబ్ సైట్లు కూడా అమ్మాయి/ అబ్బాయి.. ఇస్తున్న సమాచారం తప్పా, ఒప్పా అనే దానిని చెక్ చేయడం లేదు. దీంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలా అని.. అన్ని వెబ్ సైట్లలో మోసం జరుగుతోంది.. వాటిలో మీ సమాచారం పెట్టకండి అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కాకపోతే.. ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది.. జాగ్రత్తగా వ్యవహరించమని చెబుతున్నాం.