తమిళనాడు దివంగత  ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్నపుడు ఆమె ఆరోగ్యం గురించి అన్ని విషయాలూ తప్పుగానే చెప్పామని, అందుకు ప్రజలు క్షమించాలని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీనివాసన్‌ అన్నారు. మధురై సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో ఉన్నపుడు చాల మంది రాజకీయ నాయకులు ‘అమ్మను చూశాము. తన ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే కోలుకుంటారు. అందర్ని కలుస్తారు’ అని చెప్పారనీ, అవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఆమెను కలిసి మాట్లాడలేదని తెలిపారు. ఈ విషయంలో పార్టీ నాయకులందరూ అబద్ధాలే చెప్పారని అన్నారు. చిన్నమ్మ( శశికళ)కు బయపడే అందరూ అబద్ధాలు చెప్పినట్టు ఆయన తెలిపారు.

 

గతేడాది సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో  ఆస్పత్రిలో చేరిన జయలలితను చూడడానికి వెళితే అనుమతి లభించని వారిలో తానొకడినని అన్నారు. అమ్మ (జయలలిత) సాంబార్ ఇడ్లీ తింటున్నారని, కోలుకుంటున్నారని  ఆనాడు మేం చెప్పినవన్నీ అబద్ధాలేన్నారు.  జయలలిత ఆరోగ్యం మెరుగవ్వడంతో ఆమె పలువురు నాయకులతో సమావేశమయ్యారని వచ్చిన వార్తలూ అసత్యాలేనన్నారు. అన్నాడీఎంకే నేతలు, మంత్రులు, జాతీయ పార్టీల నేతలు ఎవరొచ్చినా అపోలో ఆస్పత్రి చైర్మన్ సీ ప్రతాపరెడ్డి క్యాబిన్‌లో మాత్రమే కూర్చుని వెళ్లే వారని మంత్రి శ్రీనివాసన్ చెప్పారు. జయలలితకు వైద్య చికిత్సపై ఆధారాలు ఉన్నాయని చెప్తున్న దినకరన్ వర్గం నేతలు దమ్ముంటే వాస్తవాలు బయట పెట్టాలని శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. జయలలిత మృతిపై ఏర్పాటైన విచారణ కమిషన్ ముందు వాస్తవాలు చెప్పాలన్నారు.

 

అమ్మ మృతిపై అనేక అనుమానాలున్నాయనే కారణంతో మాజీ హైకోర్టు నాయ్యమూర్తి నేతృత్వంలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఓ దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.