సాగరతీరమైన విశాఖ నగరానికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోని  అత్యంత ఖరీదైన నగరాల్లో విశాఖపట్నం చోటు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక నెటిజన్లు కలిగిన యాహూ సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జీడీపీ ప్రకారం ఈ సర్వే నిర్వహించగా.. మొదటి టాప్ పది నగరాలలో విశాఖ చోటు దక్కించుకుంది.

దక్షిణ భారతదేశంలో నిన్న మొన్నటి దాకా.. నగరాలు అనగానే అందరికీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మాత్రమే గుర్తుకు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ జాబితాలో విశాఖ కూడా చోటు దక్కించుకుంది. యాహూ చేపట్టిన సర్వేలో విశాఖ.. అత్యంత ఖరీదైన నగరాల్లో 9వ స్థానంలో నిలిచింది. ఈ ఘనత విశాఖ పట్నం తొలిసారిగా అందుకుంది.

దేశంలోని టాప్ 10 నగరాల్లో ముంబై  23.92 లక్షల జీడీపీతో మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో  ఢిల్లీ (జీడీపీ-19.04) నిలిచింది. ఇక తర్వాతి స్థానాల్లో కోల్‌కతా (జీడీపీ-9.75), బెంగళూరు (జీడీపీ-5.39), హైదరాబాద్ (జీడీపీ-4.81), చెన్నై (జీడీపీ-4.29), అహ్మదాబాద్ (జీడీపీ-4.13), పుణే (జీడీపీ-3.38), విశాఖపట్నం (జీడీపీ-2.79), సూరత్ (జీడీపీ-2.6)లు చోటు దక్కించుకున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఐదో స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం 9వ స్థానంలో నిలిచాయి.

విశాఖను ఆంధ్రా ఆర్థిక రాజధానిగా యాహూ సంస్థ గుర్తించింది. రిచెస్ట్ సిటీస్ లో విశాఖ గుర్తింపు పొందడానికి ఒక కారణం పర్యాటకశాఖ అని నిపుణులు చెబుతున్నారు. సర్వీస్ సెక్టార్ లో 30శాతం మంది ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. వర్తక, వాణిజ్య, తయారీ, రవాణా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందుకే రిచెస్ట్ కంట్రీల జాబితాలో నిలిచిందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

గన్నవరం పోర్టు,  ఐటీ, ఫార్మా రంగాల కారణంగా నగరంలో పారిశ్రామిక అభివృద్ధి పెరిగింది. అంతేకాకుండా విశాఖ నగరంలో చాలా బీపీవో కంపెనీలు ఉన్నాయి. త్వరలోనే ప్రముఖ ఐటీ సంస్థలు కూడా ప్రారంభం కానున్నాయి. పారిశ్రామిక రంగం కూడా మెల్లమెల్లగా అభివృద్ధి సాధిస్తోంది. ఇప్పటికే విశాఖ నగరంలో భూమి విలువ కూడా భారీగానే పలుకుతున్నట్లు సమాచారం. ఈ కారణాల దృష్ట్యా నగరం రిచెస్ట్ సిటీగా గుర్తింపు పొందింది.