భారత్ లో ముదురుతున్న విఐపి కల్చర్

VIP burden on indian taxpayer is all set to go up
Highlights

ఒక విఐపి పుట్టాడంటే దేశ ప్రజల మీద కనీసం నెలకు రెండుమూడు లక్షల భారం పడుతుంది.

భారత దేశంలో విఐపి సంస్కృతి బాగా ముదిరుతూ ఉంది. సందు సందులో మనకు విఐపి లు కనిపించే రోజు ఎంతో దూరంలో లేదు. నిజానికిది మొదలయింది. కింది స్థాయిలోనే కావచ్చు, ఖాదీ వేసుకున్న ప్రతివ్యక్తి ఒక చిన్నసైజు విఐపి లాగా తన ఇలాకాలో హడావిడి చేస్తుంటాడు.ఇతగాడు ముదిరితే, వార్డుమెంబరో,కౌన్సిలరో, ఎంపిటిసి, జడ్ పిటిసియో... వాళ్ల ఇంటి వాస్తు ఇంకా బాగుంటే ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీయో, ఎంపియో అయికూర్చుంటాడు. వీళ్లు దేశానికి బాగా ముఖ్యమని వాళ్లని మన వాళ్లు విఐపిలని పిలుస్తున్నారు. విఐపి హోదా కోసమే రాజకీయ నాయకులు పడరాని పాట్లు పడుతుంటారు. ఎందుకంటే, విఐపి గుర్తింపు వస్తూనే, ఏ రూలు పాటించనవసరం లేదు. ట్రాఫిక్ లైన్ జంపు చేయవచ్చు.లేదా పోలీసులే ట్రాపిక్ ఆపేస్తారు. ఆట పాటల్లో క్యూ జంప్ చేయవచ్చు, లేదా నిర్వహాకులే  వచ్చి మర్యాదలు చేస్తారు. దేవాలయాల్లోవిఐపి దర్శనాలుంటాయి. ఎయిర్ పోర్ట్ లలో, రైల్వేస్టేషన్లలో ప్రత్యేక మర్యాదలుంటాయి. పదవి పెద్దదయితే, డజన్ల కొద్ది కార్లతో కాన్వాయ్ లుంటాయి.

మీకు తెలుసో లేదో ప్రపంచంలో విఐపి జనాభా ఎక్కుగా పుడుతున్నది ఇండియాలోనే.

భారత విఐపిలకు అమెరికా విమానాశ్రయాలలో కష్టాలొస్తున్నాయని ఆ మధ్య కేంద్రం ఒక జాబితా తయారు చేయాలనుకుంది. అపుడు 2 వేల మంది ఉంటారనుకున్నారు.తర్వాత దీనిని 15 వేలకు పెంచాలనుకున్నారు. దేశ జనాభా వందకోట్ల పైబడి ఉన్నపుడు ఆ మాత్రం విఐపిలు లేకపోతే ఎలా అనే వాళ్లు కూడా ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఈ దుస్థితి లేదు. ఉదాహరణకు బ్రిటన్ లో గుర్తింపు పొందిన విఐపిలు కేవలం 84 మందే. ఫ్రాన్స్ లో వీళ్ల జనాభా 109 మందే. ఇక జపాన్ లో ఉండేది కేవలం 125 మంది విఐపిలే.  మిగతా దేశాలకు సంబంధించి జర్మనీలో 142, ఆస్ట్రేలియాలో 205, అమెరికా 252, దక్షిణ కొరియాలో  282, రష్యాలో 312, చైనాలో  435మంది విఐపిలున్నారు. చాలా రాష్ట్రాలలో  ఎమ్మెల్యేలను పెంచే ప్రతిపాదన ఉంది. ఒక విఐపి పుట్టాడంటే దేశ ప్రజల మీద కనీసం నెలకు రెండుమూడు లక్షల భారం పడుతుంది. టాక్స్ పేయర్ల డబ్బు తినేయోగం లేకపోతే విఐపిలకు ఆకర్షణేమీ ఉండదు.  2015లో 543 మంది ఎంపిలకు జీతభత్యాల రూపంలో  భారత ప్రభుత్వం చెల్లించిందెంతో తెలుసా... రు.176 కోట్లు.

ప్రపంచంలో ఏ సంపన్న దేశానికి లేనంత విఐపి భారాన్ని భారత్ భరిస్తూ ఉంది. దీని వల్ల ఒరిగుతున్నదేమిటో అర్థం కాదు.

 

 

 

 

loader