రాజకీయాలంటే సినిమాల్లో నటించడం కాదు రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్న కమల్ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఉందా అనే అనుమానం
రాజకీయాల్లోకి రావడమంటే సినిమాల్లో నటించినంత సులభం కాదు. సినిమాల్లో రాజకీయ నాయకుడిగా నటించి ఉండవచ్చు.. కానీ నిజజీవింతంలో రాజకీయాలు అలా కాదు. ఆ రెండింటికీ ఉన్న తేడాని విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాడు. సినిమాల్లో నటించిన మాదిరిగానే రాజకీయాల్లోనూ చెల్లుబాటౌతుందిలే అనుకుంటున్నాడు. దీంతో అందరి ముందు అబాసుపాలౌతున్నాడు.
నటుడిగా కోట్లాది ప్రజల అభిమానాన్ని చూరగొన్న కమల్ ని చూసి నవ్వుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఇప్పటికే మీకు అర్థమై ఉండవచ్చు. మీరు ఊహించింది నిజమే. ఆయన రాజకీయ ప్రవేశం చేస్తానంటూ ప్రకటించిన నాటి నుంచి రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నారు. ఒక రోజు తానే సొంతంగా పార్టీ పెడతానంటాడు.. మరోసారి వేరే పార్టీతో కలిసి పనిచేస్తానంటూ..వివిధ రకాల స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. దీంతో.. అసలు కమల్ కి తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఆ మధ్య కమల్ హాసన్.. రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే.. తన స్నేహితుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ తో కలిసి పనిచేస్తా అని చెప్పాడు. అయితే.. వీరిద్దరూ కలిసి పార్టీ పెడతారేమోలే అని అందరూ భావించారు. అలా అనుకున్నారో లేదో.. తాజాగా రజినీ కాంత్ కి కషాయ పార్టీపై మక్కువ ఎక్కవ ఉంది అని చెప్పాడు. అయితే.. రజినీ కాంత్ తో కలిసి పార్టీ పెట్టే ఆలోచన విరమించుకున్నాడేమో అని అందరూ అనుకునేలోపే అవసరమైతే.. తాను కూడా భాజపాతో కలిసి పనిచేస్తా అని చెప్పాడు. అంతేకాకుండా గతంలో ఒకసారి రాజకీయాల విషయమై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా కలిశారు. మరో నాలుగు రోజులు ఆగితే.. డీఎంకే, అన్నా డీఎంకేలతో కూడా పనిచేయడానికి అభ్యంతరం లేదు అని కూడా చెబుతారేమో అనే విమర్శలు వినపడుతున్నాయి. ఇంతకీ.. కమల్ అసలు పార్టీ పెడతారా? పెట్టకపోతే.. ఏ పార్టీలో చేరతారు అనే ప్రశ్నలు.. ప్రజల్లోనూ తలెత్తుతున్నాయి.
