శరన్నవరాత్రుల్లో మొటిరోజైన గురువారం.. అమ్మవారు స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవి గా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు నిర్వహిస్తారు.
శరన్నవరాత్రుల్లో మొటిరోజైన గురువారం.. అమ్మవారు స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవి గా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. స్వాగత హారతి తో ఉత్సవాలను ప్రారంభించారు. రాజగోపురం వద్ద కళాబృందాల సందడి ఆకట్టుకుంటోంది. అమ్మవారి నామస్మరణ తో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది.
సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రముఖుల దర్శనానికి ప్రత్యేక సమయాలను నిర్దేశించారు. వృద్ధులు, వికలాంగులకు కొండపైకి చేరుకునేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం, దేవస్థానం, కమాండ్ కంట్రోల్ రూముల్లో టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచారు. భక్తులకు ఏ ఇబ్బంది ఉన్నా వాటికి ఫోన్ చేయొచ్చు. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, అన్నదానం, పూజలు సహా అన్నీ సజావుగా సాగిపోయేలా చర్యలు తీసుకున్నారు.
రాష్ట్ర వేడుకగా ప్రభుత్వం ప్రకటించడంతో.. జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో నేతృత్వంలో పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, అగ్నిమాపక, నగరపాలక సంస్థ, ఆర్టీసీ, వైద్యారోగ్య, జలవనరులు సహా అన్ని విభాగాలూ వేడుకల నిర్వహణలో పాల్గొంటున్నాయి. దేవస్థానం, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగులు, వలంటీర్లు కలిపి ఏడు వేల మంది ఉత్సవాల నిర్వహణలో పాల్గొంటున్నారు.
