తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏడు కొండలు సిద్ధమయ్యాయి. ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏడు కొండలు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 9 రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను ముఖ్యంగా శ్రీవారి వాహన సేవలు జరిగే ఆలయ మాఢవీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల హరివిల్లులతో పాటు పుష్ప, విద్యుత్ దీపకాంతులతో తిరువీధులను దేదీప్యమానంగా అలంకరించారు. వాహన సేవలను చూసేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఆలయ ముందు భాగాన ఉండే ఖాళీ స్థలం నుంచి కూడా వేలాదిగా భక్తులు స్వామి వారి వాహన సేవ వైభోగాన్ని చూసేలా ఏర్పాట్లు చేశారు. పుష్కరిణి మరమ్మతు పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఏడాది స్వామి కోసం స్వర్ణ భూపాల వాహనాన్ని సిద్ధమైంది. దాదాపు రూ.8 కోట్లు వ్యయంతో 9 కిలోల బంగారం, 355కిలోల రాగి ఉపయోగించి ఈ వాహనాన్ని తయారు చేశారు.
సెప్టెంబర్ 22న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. 23వ తేదీ మీనలఘ్నమందు సాయంత్రం 5:48గంటల నుంచి 6గంటల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. దీంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 9గంటలకు ప్రారంభమయ్యే పెదశేష వాహన సేవతో బ్రహ్మోత్సవ సంబరం ప్రారంభమవుతుంది.
వరుసగా పెదశేష వాహనం, చినశేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వ భూపాల వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తాడు. వచ్చే నెల 1న సాయంత్రం 6 గంటలకు స్వామికి చక్రస్నానం చేయిస్తారు. అదే రోజు ధ్వజావరోహణంతో వేడుకలు ముగుస్తాయి.
