‘ ఇవాంకా’.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మార్మోగిపోతోంది. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ‘అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు-2017’ హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఇక్కడికి వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె రాకను పురస్కరించుకొని హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేస్తున్నారు. దీనిపై సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రెటీల వరకు  సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ సాఫ్ట్ వేర్ యువకుడు.. ఇవాంకా సంవత్సరానికి రెండు సార్లు హైదరాబాద్ వస్తే బాగుండు అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టగా.. అది వైరల్ గా మారింది. తాజాగా.. దీనిపై టాలీవుడ్ సింగర్ సునీత స్పందించారు.

‘‘ట్రంప్ కుమార్తె ఇవాంక రాయదుర్గం- ఖాజాగూడ రోడ్డు గుండా రావడం లేదేమో.. వస్తే బాగుండు’’ అంటూ సునీత ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ఆమె పోస్టుకి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆమె పోస్టుని 56వేల మంది లైక్ చేయగా.. 55మంది షేర్ చేశారు. వందల సంఖ్యలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మీ రాయదుర్గం వస్తే ఒకసారి మా ఆంధ్రాకి కూడా పంపించండి అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ఇవాంకా దాకా ఎందుకు..? ఒక్కసారి సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరమంతా తిరిగినా చాలని మరొకరు కామెంట్ చేశారు. ఇవాంకా.. హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కొందరు ఔత్సాహికులు షార్ట్ ఫిల్మ్ కూడా తీసేశారు. అందులో ఇవాంకా అచ్చమైన తెలంగాణ యాస మాట్లాడినట్లు పెట్టారని.. ఓ నెటిజన్ సునీత పోస్టుకి కామెంట్ పెట్టాడు. సునీతలాగానే మరికొందరు కూడా మా ప్రాంతానికి కూడా ఇవాంకా వస్తే బాగుండని కామెంట్ చేశారు.