ఇవాళ ఉదయం రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్  లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు లేకపోవడంతో మితిమీరిన వేగంతో వెలుతున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది.  ఈ ప్రమాదంలో 32 మంది ప్రయాణికులు మృత్యువాత పడగా, చాలా మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

వివరాల్లోకి వెళితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు భక్తులు రాజస్థాన్ లోని రామ్ దేవర ఆలయానికి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో దౌసాలాల్ సాట్ నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరారు. అయితే ఈ ఉదయం బస్సు ఓ నది వంతెనపై వెళుతుండగా ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి.. అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు నిద్ర లేవకుండానే మృత్యు ఒడిలోకి చేరిపోయారు.  


ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రులను కాపాడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ఆ తర్వాత మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.