రైల్వేలో పనిచేస్తున్న దాదాపు 13వేల మంది ఉద్యోగాలపై రైల్వే శాఖ వేటు వేయనుంది. క్రమశిక్షణా రహిత చర్యల్లో భాగంగా ఆ ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అసలు విషయం ఏమిటంటే.. రైల్వే పనితీరును మెరుగుపరిచేందుకు, ఉద్యోగుల్లో నిబద్ధతను పెంచేందుకు ఇటీవల రైల్వేశాఖ ఓ డ్రైవ్‌ చేపట్టింది. ఇందులో భాగంగా చాలా కాలంగా సెలవులో ఉంటున్న సిబ్బంది వివరాలను సేకరించింది. ‘మొత్తం 13 లక్షల మంది ఉద్యోగుల్లో 13వేల మంది చాలా కాలం నుంచి అనధికారికంగా సెలవులో ఉంటున్నట్లు గుర్తించాం. వారిపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించాం. అలాంటి ఉద్యోగులను విధుల నుంచి తీసేయాలని భావిస్తున్నాం’ అని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఉద్యోగుల జాబితా నుంచి వీరి పేర్లను తొలగించాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.