బెంగళూరు: తనను చంపేస్తారేమోనని భయం కలుగుతోందని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ఆదివారంనాడు గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవానితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తనపై బిజెపి వ్యక్తిగత దాడులకు దిగుతోందని విమర్శించారు.  

బిజెపి కార్యకర్తలు తన వెంట పడుతున్నారని, తనకు భయం కలుగుతోందని అన్నారు. తన తల్లి, భార్యతో పాటు తన ఇంట్లో వాళ్లు తన ప్రాణాల గురించి భయపడుతున్నారని ఆయన అన్నారు.  తాను ఎన్ని ఆపదలనైనా ఎదుర్కుంటానని వారిని సముదాయిస్తున్నట్లు తెలిపారు. 

తాను ప్రజలతో మాట్లాడడానికి వెళ్తున్న ప్రతిసారీ బిజెపి కార్యకర్తలు తనను వెంటాడుతున్నారని ఆయన అన్నారు.  తాను ప్రశ్నలు వేస్తే హిందూ వ్యతిరేకి అనడం ఎందుకని ఆయన అడిగారు. తాను ప్రారంభించిన జస్ట్ ఆస్కింగ్ రాజకీయ పార్టీ కాదని, అదో ఆందోళన అని, అందరినీ ప్రశ్నించే బాధ్యత తనకు ఉందని ఆయన అన్నారు. 

మహదాయి విషయంలో అవాస్తవాలు చెబుతున్నారని, ప్రధాని స్వయంగా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని ఆయన అన్నారు. గనుల యజమానులను క్షమించాల్సింది యడ్యూరప్ప కాదని, కర్ణాటక ప్రజలని ఆయన అన్నారు. తన పోరాటంలో రాజకీయం గానీ దురుద్దేశం గానీ లేదని అన్నారు.