ప్రముఖ రచయిత దేవీప్రియ కి సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. పద్యకావ్య విభాగంలో ఈయనకు ఈ అవార్డు వరించింది. దేవీప్రియ రచించిన ‘గాలిరంగు’ అనే పద్యకావ్యానికి  గాను ఆయన సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయనతోపాటు మరో వ్యక్తిని కూడా ఈ అవార్డు వరించింది. అనువాద విభాగంలో వీణా వల్లభరావుకి అవార్డు దక్కింది. పంజాబీలో ప్రచురితమైన ఖానాబదోష్ ఆత్మకథను వల్లభరావు తెలుగులోకి ‘విరామమెరుగని పయనం’ పేరుతో అనువదించారు. సాహిత్య ప్రపంచంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్ని అత్యుత్తమ పురస్కారాలుగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 24 భాషల్లోనూ అవార్డులను ప్రకటించగా.. తెలుగులో వీరిద్దరు అవార్డుకు ఎంపికయ్యారు. 

బహుముఖ ప్రజ్ఞాశాలి దేవీప్రియ

కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, సినీ గేయ రచయితగా, డాక్యుమెంటరీ రూపకర్తగా, టీవీ ఛానెల్‌ కంటెంట్‌ విభాగాధిపతిగా పేరుగాంచిన దేవీప్రియ 1949 ఆగష్టు 15న గుంటూరులో జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజాహుస్సేన్. చదువుకునే రోజుల్లోనే కవిత్వం పట్ల ఆకర్షితుడై పద్యాలు, గేయాలు రాయడం ప్రారంభించారు. పత్రికల్లో ఫ్రీలాన్సర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం పత్రికా సంపాదకుని వరకు సాగింది. పలు దినపత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేసిన దేవీప్రియ.. 'ప్రజాతంత్ర', 'హైదారాబాద్‌ మిర్రర్‌' దినపత్రికలకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ‘రన్నింగ్ కామెంటరీ’ కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో ఆయన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పన్నెండుకు పైగా పుస్తకాలు రాశారు. ప్రజాగాయకుడు గద్దర్‌పైనా డాక్యుమెంటరీని నిర్మించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు.