Asianet News TeluguAsianet News Telugu

రోడ్ సైడ్ హోటల్ భోజనం కోసం క్యూ కడుతున్న కార్లు!

తమిళనాడు లోని ఆ రోడ్ సైడ్ హోటల్ లో భోజనం చేయటంకోసం ఎక్కడెక్కడినుంచో… ఆఖరికి చెన్నై, బెంగళూరు నగరాలనుంచి కూడా కార్లేసుకుని పనిగట్టుకుని వస్తారు.

people throng this roadside hotel for delicious home food

 

people throng this roadside hotel for delicious home food

 

అదొక రోడ్డుపక్క పూరిపాకలో ఉన్న హోటల్. కానీ ఆ హోటల్ లో భోజనం చేయటంకోసం ఎక్కడెక్కడినుంచో… ఆఖరికి చెన్నై, బెంగళూరు నగరాలనుంచి కూడా కార్లు వేసుకుని పనిగట్టుకుని వస్తారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు 79 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కన ఉన్న ఈ హోటల్ లో అన్నీ స్పెషాలిటీలే.

ఈ హోటల్ కు యజమాని కరుణైవేల్ పెట్టిన పేరు యూబీఎమ్ అయినప్పటికీ అందరూ దీనిని ‘నమ్మ వీట్టు సాపాటు’(స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే - స్వగృహ భోజనం) అని పిలుస్తారు. భోజనంలో 25 రకాల నాన్ వెజ్ వంటకాలను వడ్డించే ఈ హోటల్ మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటలవరకు(ఒక్క పూట మాత్రమే) నడుస్తుంది. దీనిని నిర్వహిస్తున్న కరుణైవేల్ దంపతులు భోజనం చేయటానికి వచ్చినవారిని తమ ఇంటికి వచ్చిన అతిథులలాగా చూసుకుంటూ లోపలికి వచ్చిన దగ్గరనుంచి తిని వెళ్ళేదాకా ఆప్యాయంగా సత్కారాలు చేయటం మొదటి విశేషం. లోపలికి ప్రవేశించగానే భార్య పసుపుకుంకుమలు, చందనంతో ఆహ్వానం పలుకుతారు.

ముందుగా అతిథులను లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆరడుగుల పెద్ద అరిటాకు వేస్తారు. దానిమీద ఇద్దరు వ్యక్తులు తినవచ్చు. ఒక్కొక్కరికీ విడివిడిగా కావాలంటే విడి విడిగా మూడడుగుల ఆకులు కూడా వేస్తారు. ఒక మినరల్ వాటర్ బాటిల్ ఇస్తారు. ఆకు కడిగిన తర్వాత భర్త వచ్చి తినేవారికి నమస్కరించి ముందు ఉప్పు వడ్డిస్తారు. తర్వాత అన్నం వడ్డించగానే, భార్య సాంబారు తీసుకొచ్చి ఆ అన్నంలో పోస్తారు. ఇక అక్కడినుంచి ఒకటొకటిగా పదార్థాలు వస్తూ ఉంటాయి. చికెన్ కు సంబంధించి బిర్యానీ, పెప్పర్ చికెన్, ఫ్రై, లెగ్ పీస్, నాటుకోడి పులుసు వంటి 8 వెరైటీలు, మటన్ కు సంబంధించి కీమా, లివర్ ఫ్రై వంటి 8 వెరైటీలు, ఫిష్ కు సంబంధించి ఫ్రై, కొళుంబు వంటి 8 వెరైటీలు వడ్డిస్తారు. వీరు వడ్డించే రసం కూడా ఒక స్పెషలే. దీని రుచి మరెక్కడా కనిపించదని కస్టమర్స్ అంటుంటారు. ఇన్ని పదార్థాలు తిన్నందున వేడి చేస్తుందనే ఉద్దేశ్యంతో చలవ చేసేందుకుగానూ - చివరికి వడ్డించే పెరుగులో గుల్ కంద్ వడ్డించటం మరో విశేషం. భోజనం తర్వాత ఐస్ క్రీమ్, కిళ్ళీ కూడా ఉంటాయండోయ్.

 

people throng this roadside hotel for delicious home food

పదార్థాలు అన్నీ అన్ లిమిటెడ్. వచ్చినవారందరినీ కన్నా, కన్నా అని పిలుస్తూ భార్యాభర్తలిద్దరూ కొసరి కొసరి ఆప్యాయంగా వడ్డిస్తారు. ఎవరైనా ఏదైనా వంటకాన్ని సరిగ్గా తినకపోతే చిరుకోపంతో మందలిస్తూ తామే దానిని నోట్లో పెట్టి తినిపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మనకెంతో ఇష్టమైనవారు ఇంటికొస్తే మనం ఎలా భోజనం పెడతామో వారు అలా పెడతారు.

ఈ మొత్తం పదార్థాలకుగానూ వారు తీసుకునేది రు.500. ఆ పాకలో మొత్తం 20 సీట్లు మాత్రమే ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ విధానం పెట్టారు. అక్కడ భోజనం చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. రష్ విపరీతంగా పెరిగిపోవటంతో ఇటీవల పక్కనే మరో చిన్న పాక వేశారు. అక్కడొక 30 మంది కూర్చుని భోజనం చేయటానికి ఏర్పాటు కల్పించారు.

నాన్ వెజ్ లోకి కావలసిన మాంసం, చికెన్, చేపలను తానే స్వయంగా ప్రతిరోజూ ఫ్రెష్ గా కొనుగోలు చేసి తీసుకొస్తానని, నాణ్యతలో ఎక్కడా రాజీపడబోనని యజమాని కరుణైవేల్ చెప్పారు. వంటకాల తయారీలో వాడే మసాలాలను బయట కొనబోమని, తామే సొంతంగా తయారు చేస్తామని తెలిపారు. కొన్ని కొన్ని వంటకాలలో రుచుకోసం నువ్వులనూనే ఉపయోగిస్తామని చెప్పారు. వంట మొత్తం కరుణైవేల్ భార్యే చేస్తారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కరుణైవేల్, అతని భార్య ఇద్దరూ వెజిటేరియన్స్ కావటం. తాను పూర్తిగా శైవుడినని, గుడ్డుకూడా ముట్టనని కరుణైవేల్ చెప్పారు. రోజులో ఒక్కపూట… సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భోజనం చేస్తానని అన్నారు. తన భార్య మాత్రం ఎనిమిది సంవత్సరాల క్రితంనుంచి నాన్ వెజ్ తినటం మనివేసిందని తెలిపారు.

తమ తాత ముత్తాతలనుంచి తమ కుటుంబం ఆతిథ్యానికి పెట్టిన పేరు అని, తమ ఆర్థిక స్థోమత తగ్గిపోవటంతో తాను ఈ ఆతిథ్యాన్నే ఉపాధిగా ఎంచుకున్నానని చెప్పారు. తమ దగ్గరికి వచ్చిన ప్రతివారూ సంతృప్తిగా ఆరగించి వెళ్ళాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. తనకు డబ్బులు ముఖ్యం కాదని, ఎవరైనా చేసే పనిని శ్రధ్ధగా చేస్తే వారి బాగోగులను భగవంతుడే చూసుకుంటాడన్నది తన నమ్మకమని చెప్పారు. ఈ హోటల్ కు తానేమీ పబ్లిసిటీ చేయలేదని, ఆ నోటా, ఆ నోటా పాకి ప్రచారం లభించిందని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల ఫేస్ బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా వలన అతిథుల సంఖ్య అనూహ్యరీతిలో పెరిగిపోయిందని వెల్లడించారు.

యూబీఎమ్ హోటల్ కారణంగా అది ఉన్న శీనాపురం అనే కుగ్రామం ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతోంది. హోటల్ లోపల 50 మంది తింటూ ఉండగా మరో 50 మంది పెద్ద పెద్ద కార్లలో బయట ఆత్రుతగా తమ వంతుకోసం ఎదురు చూస్తూ ఉంటారు. పలువురు తమిళ సినీ ప్రముఖులు కూడా ఈ హోటల్ ను సందర్శించి భోజనం చేసినట్లు అక్కడున్న ఫోటోలో తెలుపుతుంటాయి. మీరు కూడా ఈ సారి కోయంబత్తూరుగానీ, ఊటీ గానీ వెళితే ఆ హోటల్ లో భోజనం చేసిరండి. ఇంత హై క్యాలరీ ఫుడ్… అదీ అంత పెద్ద క్వాంటిటీలో తింటే లివర్ ఏమైపోతుందనే సందేహం ఏర్పడినా, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా తింటాం కాబట్టి ఆ విషయాన్ని పట్టించుకోనక్కరలేదు. ఈ హోటల్ కోయంబత్తూరుకు, ఈరోడ్ కు మధ్య హైవేపై ఉంటుంది. వారి మొబైల్ నంబర్ - 93629 47900.

 

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios